ఈ పార్లమెంటు ఎన్నికలలో యువత ప్రస్తుత రాజకీయాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని మెదక్ ఎంపీ,,,

భారత్ న్యూస్ హైదరాబాద్….

కొల్చారం కార్నర్ మీటింగ్ లో
ఎంపీ అభ్యర్థి నీలం మధు

ఈ పార్లమెంటు ఎన్నికలలో యువత ప్రస్తుత రాజకీయాలపై ఒక్కసారి ఆలోచన చేయాలని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొల్చారం మండలం కేంద్రంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసినిలతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలోని పార్టీలు కొన్ని యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో బీఆర్ఎస్ యువతను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఓట్ల కోసం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని అసత్యపు ప్రకటనలు చేసి, ఆయా పార్టీలు పబ్బం గడిపాయని పేర్కొన్నారు. ఏకైకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే యువతకు మేలు జరుగుతుందన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్, బిజెపి అధికారంలో ఉండి, ప్రజలకు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా ? అని ప్రశ్నించారు. ఆయా పార్టీకి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదల పక్షాన నిలుస్తుందన్నారు. దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబం బడుగు బలహీన వర్గాల బిడ్డ అయిన తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెదక్ గడ్డం నుంచి గెలిచి ప్రధాని అయిన ఇందిరా గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని, అలాంటి మెదక్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించుకోవాల్సిన ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంపీగా గెలిచాక ఈ ప్రాంతా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతుగా దోహదం చేస్తానని అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి, పార్లమెంటుకు పంపాలని నీలం మధు ముదిరాజ్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, ముఖ్య నాయకులు ప్రవీణ్ రెడ్డి, పెంటారెడ్డి, రంగంపేట సర్పంచ్ బండి రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గౌడ్, శేఖర్, కృష్ణ గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.