Headlines

‘టీటీడీలో వేతనాల పెంపుపై సిఐటియు హర్షం’

‘టీటీడీలో వేతనాల పెంపుపై సిఐటియు హర్షం’

తిరుపతి ( భారత్ న్యూస్ )తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ తీవ్ర వివక్షకు గురవుతున్న వేలాదిమంది కార్మికులకు టీటీడీ పాలకమండలి వేతనాలు పెంచడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తాము పలుమార్లు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని సానుకూల నిర్ణయం చేసినందుకు కరుణాకర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

టిటిడి క్యాంటీన్లు పర్మినెంట్ ఉద్యోగులకే నన్న భావన తొలగించి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులకు కూడా భోజన వసతి కల్పించడం పట్ల ఆయన హర్షం తెలియజేశారు.

ఇదే తరహాలో బ్రహ్మోత్సవ బహుమానాన్ని అందరికీ వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులకు సేవలు అందించడంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచ నీయమైనదని వారికి అందిస్తున్న సౌకర్యాలు పరిమితమైనవని గుర్తు చేశారు. వాస్తవంగా ముఖ్యమంత్రి రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలు కాలేదని, గత పాలకమండలి చైర్మెన్ లకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.

కనీసం భూమన కరుణాకర్ రెడ్డి వారి గోడు విని తన పరిధిలో కొన్ని సౌకర్యాలు కల్పించడానికి చేసిన కృషిని అభినందిస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

టీటీడీలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి తగినన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు .