రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ ఢిల్లీ….రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’ అని అత్యున్నత న్యాయస్థానం సంచలన ప్రశ్నలు సంధించింది. వెనుకబడిన వర్గాల్లోని ‘క్రీమీలేయర్’ (ధనిక, ఉన్నత శ్రేణి) పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

తరతరాల కోటాతో వ్యవస్థ నుంచి బయటపడలేం!

విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. విద్య, ఆర్థిక సాధికారత ద్వారా సమాజంలో ఒక స్థాయి లభిస్తుందని పేర్కొన్నారు. ‘రిజర్వేషన్ల ద్వారా ఒకసారి ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా, మళ్లీ వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరికాదు. ఇలాగైతే మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు.