అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

భారత్ న్యూస్ విజయవాడ…అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

రైతు సోదరులు ఎవరూ అధైర్య పడవద్దు.

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి భరోసా.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 30/04/2026.

వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు భరోసానిచ్చారు.

నేడు గురువారం సాయంత్రం ధాన్యం కొనుగోళ్లు గురించి వీడియో ద్వారా ప్రత్యేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల రైతాంగం అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

గడచిన మూడు నాలుగు రోజుల నుంచి డీజిల్ కొరత కారణంగా రవాణా సౌకర్యం లేక ధాన్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేసేందుకు లారీలు అందుబాటులో లేక ఇబ్బంది ఏర్పడి ధాన్యం కొనుగోలుకు కొంత ఆలస్యం జరిగిందన్నారు.

నిన్నటి నుంచి ధాన్యం కొనుగోలు జరుగుతుంటే నేటి సాయంత్రం అకాల వర్షం కురిసిన కారణంగా ధాన్యం తడిసిందన్నారు. రైతులకు వచ్చిన కష్టానికి, జరిగిన నష్టానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు సివిల్ సప్లయిస్ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.

మైలవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని నాయకత్వాలు రైతులకు అండగా ఉండి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని వారికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తను అందరికీ అందుబాటులో ఉంటానని తప్పకుండా ఏ సమస్య వచ్చినా తనకు కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

నిన్న బుధవారం ఒక్కరోజు 540 టన్నులు రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు, మద్దులపర్వ, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. రేపుకూడా శుక్రవారం నాడు ధాన్యం కొనుగోలు చేపట్టనున్నామని, రైతులందరూ ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని కోరారు.