సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..!!

భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..!!

దుబ్బాక: ‘దేశ సరిహద్దుల్లో శత్రువులతో నేను పోరాడుతుంటే.. సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తోంది’ అని సిద్దిపేట జిల్లాకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ బూర రామస్వామి వాపోయాడు.
తన భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జమ్మూకశ్మీర్‌ నుంచి శనివారం ఓ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

సిద్దిపేట జిల్లా భూంపల్లి-అక్బర్‌పేట మండలం చౌదర్‌పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించాడు. ‘1992లో ధర్మాజీపేట శివారులోని 406 సర్వే నంబర్‌లో నా తల్లిదండ్రులు 1.16 ఎకరాల భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేశారు. ఆ భూమిని నా గ్రామానికే చెందిన వీఆర్వో రమేష్‌.. తన సోదరుల పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడు. భూమి గురించి అడిగితే వీఆర్వో బంధువులు నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మా భూమిని మాకు దక్కేలా చేయాలి’అని వేడుకున్నాడు. ఈ వీడియోపై స్పందించిన బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు.. వెంటనే జిల్లా కలెక్టర్‌ మనుచౌదరికి ఫోన్‌ చేసి జవాన్‌ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. తన ఎక్స్‌ ఖాతాలో కూడా ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో వెంటనే స్పందించింది. శనివారం సాయంత్రం భూంపల్లి తహసీల్దార్‌ మల్లిఖార్జున్, ఆర్‌ఐ తదితరులు పంచనామా నిర్వహించి కలెక్టర్‌కు నివేదించారు.