ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సమరశీల రైతాంగ పోరాటాలు:

భారత్ న్యూస్ హైదరాబాద్..

ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సమరశీల రైతాంగ పోరాటాలు:
–టి. సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం

అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెయస్) ఆవిర్భావ స్ఫూర్తితో కేంద్రం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల రైతాంగ పోరాటాలకు సన్నద్ధం అవుతామని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు.

హైదరాబాదులోని జవహర్ నగర్ లో గల తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ 89వ ఆవిర్భావం సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సభ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం టి సాగర్ మాట్లాడుతూ… గత 89 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయోద్యమ కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా సంస్థానాలలో రైతాంగ సమస్యలను తీసుకొని పోరాటం చేసిందని తెలిపారు. పేదలు సాగు చేస్తున్న భూములపై వాళ్లకే హక్కులు కావాలని, కౌలు రేట్లు తగ్గించాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరలు అమలు చేయాలని ప్రారంభమైన కిసాన్ సభ. అనేక పోరాటాలు నిర్వహించి త్యాగాలు చేసింది విజయాలు సాధించింది. రేపు రాబోయే కాలంలో కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో కనీస మద్దతు ధరల చట్టం సాధన కోసం, రైతాంగానికి రుణ విముక్తి చట్టం సాధించేందుకు, ఎరుగైన పంటల బీమా పథకాన్ని సాధించటం కోసం, ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒకవైపు స్వతంత్ర పోరాటాలు నిర్వహిస్తూనే మరోవైపు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం అవుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, నాయకులు టి కిషోర్,దుగ్గి బ్రహ్మం, వెంకట్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ తదితరులు పాల్గొన్నారు.