నీట్‌ పరీక్ష రేపే

భారత్ న్యూస్ హైదరాబాద్…నీట్‌ పరీక్ష రేపే

రాష్ట్రం నుంచి 73,084 మంది అభ్యర్థులు

24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు

సీసీ కెమెరాల నిఘాలో మెడికల్‌ ఎంట్రెన్స్‌

హైదరాబాద్‌, మే 2 : దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌ యూజీ-2026) ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్ష నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్యతోపాటు పరీక్ష కేంద్రాల సంఖ్య కూడా పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు నిర్ణీత సమయం కన్నా అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సివుంటుందని అధికారులు పేర్నొన్నారు. పెన్‌ అండ్‌ పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) పద్ధతిలో నీట్‌ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 556 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లో కూడా 14 చోట్ల నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. నీట్‌ పేపర్‌లో 180 ప్రశ్నలుంటాయి. అన్నింటికీ జవాబివ్వాల్సివుంటుంది. సరైన జవాబుకు నాలుగు మార్కులు ఇస్తారు. జవాబు తప్పు అయితే ఒక మార్క్‌ కట్‌ చేస్తారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్‌ (45 ప్రశ్నలు), కెమిస్ట్రీ (45), బయాలజీ( బోటనీ-జువాలజీ) 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఏడాది తెలంగాణ నుంచి మొత్తం 73,084 మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది 72,507 అభ్యర్థులు 190 కేంద్రాల్లో పరీక్ష రాశారు. కాగా, పరీక్షా కేంద్రాలన్నింటినీ కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే (మెడికల్‌ కాలేజీలు మినహా) ఏర్పాటు చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయిలో వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్రకుమార్‌ నోడల్‌ ఆఫీసర్‌గా, అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ పోలీసు ప్రతినిధిగా, ఏన్టీఏ తరఫున డాక్టర్‌ వృందేశ్వరీ పవార్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో సంబంధిత జిల్లా కలెక్టర్‌ చైర్మన్లుగా, సీపీ లేదా ఏస్పీలు పోలీసు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తున్నారు. నీట్‌ నిర్వహణపై సీఎస్‌ రామకృష్ణారావు శుక్రవారం వైద్యశాఖ, పోలీసు ఉన్నతాఽధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అత్యంత పకడ్బందీగా భద్రత..

నీట్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రతి ఐదు కేంద్రాలకు ఒక సివిల్‌ నోడల్‌ ఆఫీసర్‌, ప్రతి కేంద్రం వద్ద ఒక పోలీసు ఆఫీసర్‌ను నియమించారు. కేంద్రాల వద్ద డ్యూయల్‌ లేయర్‌ ఫ్రిస్కింగ్‌(తనిఖీలు) ఉంటుంది. అన్ని కేంద్రాల్లో సీసీటీవీ సర్వైలెన్స్‌, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌, జామర్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, స్టోరేజీ అంతా పోలీసు రక్షణలో, సీసీ కెమెరాల నిఘాలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే ఎన్‌టీఏకు నివేదించేలా జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కాగా, నీట్‌కు ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి.. చిరునామా ఆధారంగా వారి ఇంటికి సమీపంలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది. గతంలో భిన్నంగా ఎక్కడెక్కడో కేంద్రాలను కేటాయించేవారు. ఇక ఈసారి పరీక్ష కేంద్రాల కేటాయింపులో అమ్మాయిలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా కేంద్రాల్లో ఇంకా సీటింగ్‌ సామర్థ్యం ఉంటే అబ్బాయిలకు కేటాయించారు. ఎప్పటి మాదిరిగానే డ్రెస్‌ కోడ్‌ కచ్చితంగా అమలు చేస్తారని, పారదర్శకమైన వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలని, మూడే పేజీలుండే అడ్మిట్‌ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

15-20 ప్రశ్నలు చాలా కఠినంగా..

నీట్‌ పరీక్షలో ఒక్కో సబ్జెక్టు నుంచి కనీసం ఐదారు ప్రశ్నలు చాలా కఠినంగా ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా 15-20 ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉంటాయని పేర్కొంటున్నారు. యావరేజ్‌ విద్యార్థులు ఈ ప్రశ్నలకు వెంటనే జవాబులు ఇవ్వకూడదని, వాటిని వదిలేయాలని సూచిస్తున్నారు. చివరి అరగంటలో మాత్రమే వాటిని అటెంప్ట్‌ చేయాలని చెబుతున్నారు. సగటున ఒక ప్రశ్నకు ఒక నిమిషంపాటు మాత్రమే సమయం ఉంటుందని, ఈ ప్రశ్నల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకూడదని అంట్తున్నారు. టాపర్స్‌ మాత్రం ప్రతి ప్రశ్నకూ జవాబు ఇచ్చుకుంటూ వెళ్లాలని అంటున్నారు. కాగా, తెలంగాణలో గతేడాది నీట్‌ పరీక్షలో 405 మార్కులు సాధించిన వారికి జనరల్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీటు దక్కింది.