..భారత్ న్యూస్ హైదరాబాద్….కరీంనగర్‌లోని చలమేడ ఆనందరావు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ల సస్పెండ్
కరీంనగర్‌లోని చలమేడ ఆనందరావు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం వైద్య విద్యా రంగంలో ప్రైవేట్ సంస్థల నిరంకుశ పోకడలకు, విద్యార్థుల హక్కుల అణచివేతకు నిదర్శనం. తమ పెండింగ్ స్టైపెండ్‌ల గురించి మేనేజ్‌మెంట్‌ను నిలదీసినందుకు వారిపై ఉక్కు పాదం మోపారు.
స్టైపెండ్‌ల జాప్యంపై నిరసన…
డాక్టర్స్ డే రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ స్టైపెండ్లు నెలల తరబడి చెల్లించకపోవడంపై గళమెత్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడారు. అయితే ఈ నిరసనను అణచివేసేందుకు కాలేజీ యాజమాన్యం ఏకంగా 64 మంది హౌస్ సర్జన్లను సస్పెండ్ చేయడం అభ్యంతరకరం. ఈ ఘటనలో పోలీసులు కూడా విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.
బెదిరింపులు, మానసిక ఒత్తిడి…
సస్పెన్షన్‌తో ఆగకుండా కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం చేయడం, ఇంటర్న్‌షిప్ ఎక్స్‌టెన్షన్ పేరుతో బెదిరింపులకు పాల్పడటం విద్యార్థులలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, స్వేచ్ఛగా మాట్లాడే హక్కును హరిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం…
చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీ యాజమాన్యపు వైఖరి దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ వైద్య విద్యా సంస్థలలో నెలకొన్న అణచివేత ధోరణిని చూపిస్తోంది. స్టైపెండ్‌ల ఆలస్యం అనేది ఒక సాధారణ సమస్యగా మారగా, దీనిపై ప్రశ్నించినందుకు సస్పెన్షన్‌లాంటి కఠిన చర్యలు తీసుకోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఇది కేవలం చలమేడ కాలేజీకి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర ప్రైవేట్ వైద్య సంస్థలలో కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
