జాతీయ రహదారిపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపితే కేసులు నమోదుచేసి, వాహనాలను సీజ్ చేస్తాం||విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయనగరం జిల్లా పోలీస్||

||జాతీయ రహదారిపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపితే కేసులు నమోదుచేసి, వాహనాలను సీజ్ చేస్తాం||
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జాతీయ రహదారిపై లారీ/ట్రక్/బస్సు డ్రైవర్లు తమ వాహనాలను అనుమతి లేని ప్రదేశాల్లో, ముఖ్యంగా ప్రధాన రహదారి మీద దాబాల వద్ద, వంతెనల సమీపంలో, మలుపుల మరియు జంక్షన్‌ల వద్ద నిలిపివేసి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. ఈ విధమైన నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, వెనుక నుంచి వచ్చే వాహనాలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి, అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కొన్నిసార్లు ఈ ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ప్రజల భద్రత, రక్షణ దృష్ట్యా మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు డ్రైవర్లకు కొన్ని సూచనలు చేసారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాన రహదారి పై వాహనాలను నిలిపివేయకూడదు. ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా, ఇతర వాహనదారులకు ప్రమాదకరమైంది.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను ఆపవలసి వస్తే, రహదారి పక్కనున్న అనుమతించబడిన లే-బైలు, ట్రక్ పార్కింగ్ స్థలాలు లేదా గుర్తించిన విశ్రాంతి కేంద్రాల వద్ద మాత్రమే ఆపాలి.

మలుపులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, జంక్షన్లు మరియు కనిపించే దూరం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదు.

అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని నిలిపివేయవలసి వస్తే, తప్పనిసరిగా హజార్డ్ లైట్లు ఆన్ చేసి ఉంచాలి.

వాహనాలకు వెనుక భాగంలో రేడియం స్టికర్/టేప్ లను అతికించాలి.

డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి, ఇతర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి.

జాతీయ రహదారిపై రోడ్ సేఫ్టీ మొబైల్స్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ మరియు తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. నిబంధనలు ఉల్లంఘించిన లారీ డ్రైవర్లు మరియు వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, అవసరమైతే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

అన్ని ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు, లారీ యజమానులు మరియు డ్రైవర్ సంఘాలు తమ సభ్యులకు ఈ సూచనలను తెలియజేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని జిల్లా ఎస్పీ కోరారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||