రుద్రంగిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిజిపి బి శివధర్ రెడ్డి

భారత్ న్యూస్ వరంగల్…..రుద్రంగిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిజిపి బి శివధర్ రెడ్డి

వేములవాడ ఆలయంలో పూజలు చేసిన డిజిపి

రుద్రంగి/వేములవాడ, ఏప్రిల్ 24: రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి .శివధర్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో ఎకరం పది గుంటల స్థలంలో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలతో కలిసి డిజిపి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిజం అంతమైందని, ప్రజలే కేంద్రంగా సేవలు అందించేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ….ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు, భీమారంలో నూతన పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని, రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు గట్టి చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే జిల్లాలో డి-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రుద్రంగి పోలీస్ స్టేషన్ అవసరం అన్నారు. ఇటీవల మహాశివరాత్రి జాతరను జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించిందని తెలిపారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ రుద్రంగిలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాబాయ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ ఆలయంలో పూజలు నిర్వహించిన డిజిపి బి. శివధర్ రెడ్డి

వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి వారిని డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న డిజిపికి అర్చకులు వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని డిజిపి కి అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే వేములవాడ ఆర్డీవో రాధాబాయి,వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు,పోలీస్ అధికారులు, సిబ్బంది,ఆలయ ఏఈఓ జి. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….