tuda chairman chevireddy mohit reddy in the

పాకాల మండల సర్వసభ్య సమావేశంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పాకాల( భారత్ న్యూస్ )

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆదరించిన ప్రజల పట్ల అత్యంత విశ్వాసంతో, అభివృద్దే తన అభిమతంగా పనిచేస్తున్నారని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పాకాల మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చేందుకు ఎమ్మెల్యే కృషి ఎనలేనిదని కొనియాడారు. శనివారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన పాకాల మండల సర్వసభ్య సమావేశానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి వారితో మమేకమవుతూ పండుగ సమయాల్లో స్వీట్స్, వస్త్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా కరోనా వంటి విపత్కర పరిణామాల్లో కూడా ప్రజలకు అండగా నిలిచామని వివరించారు. మాస్క్ లు, సానిటైజర్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రాణాలను సైతం లెక్కచేయక కరోనా, రాయల చెరువు గండి పడిన సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించిన సంఘటనను గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు ఆలోచించాలని, మరో మారు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలు సీఎం జగనన్నతోనే సాధ్యం అన్నారు.