వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

వేడుకగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

  • ముగిసిన బ్రహ్మోత్సవాలు తిరుపతి (భారత్ న్యూస్ )తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత అక్కడినుండి స్వామివారు శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పి.ఆర్‌ తోటకు వేంచేశారు. సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధి, కోటకొమ్మల వీధి, కొత్తవీధి మీదుగా శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారు. మధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8.౩౦ నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, కంకణభట్టర్‌ శ్రీ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.