విజయ్ కటౌట్ చూసి ఓటేసేశారు డ్యూడ్..!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….విజయ్ కటౌట్ చూసి ఓటేసేశారు డ్యూడ్..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్నికలు రాగానే ఎప్పుడూ రాని రాజకీయ నాయకులు ఊళ్లలో దర్శనమిస్తారు. ఐదేళ్ల పాటు కనీసం నియోజకవర్గం మొహం చూడనివారు సైతం ఎన్నికలనగానే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. పోలింగ్ సమీపించగానే తమ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. ఈ విషయంలో విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అతి తక్కువ ర్యాలీల్లో పాల్గొని.. రెండు ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు.

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే వేరు.. టీవీకే వేరు. ఆ రెండు పార్టీలకు సంస్థాగత నిర్మాణం ఉంది. బలమైన క్యాడర్ ఉంది. అంతకుమించి పేరున్న నేతలున్నారు. కానీ టీవీకే పరిస్థితి అలా కాదు. ఆ పార్టీల్లో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ విజయే. అలాంటిది కీలక సమయంలో చాలావరకు ఎన్నికల ర్యాలీలను విజయ్ రద్దు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి ఉన్నా కొన్ని సమావేశాలను క్యాన్సిల్ చేశారు. ప్రచార కార్యక్రమాల రద్దుపై ఓ దశలో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, కరూర్ తొక్కిసలాట రూపంలో ఏర్పడిన మచ్చ పునరావృతం కాకుండా ఉండేందుకు విజయ్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రచారం అంటూ ఆరోపణలు…

తమిళనాడులో 38 జిల్లాలకు గానూ విజయ్ పర్యటించిన జిల్లాల సంఖ్య 10లోపే. రాష్ట్రం మొత్తంలో ఆయన ప్రచారం నిర్వహించింది నాలుగోవంతు కూడా లేదని స్థానిక మీడియా పేర్కొంది. మార్చి 30న పెరంబూర్లో నామినేషన్ వేసిన విజయ్.. ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విల్లివాక్కంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 2, 4 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్.. మధ్యలో నాలుగు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కడలూరు, తిరువళ్లూరుల్లో నిర్వహించాల్సిన ప్రచారాలనూ రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థులు విజయ్్న ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

రోటీను భిన్నంగా…

విజయ్ ప్రచారానికి రానిచోట ఆ పార్టీ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ అభ్యర్థి విజయ్ 3డీ హోలోగ్రామ్ పక్కన పెట్టుకుని ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరుకు చెందిన అభ్యర్థి సెంథిల్ కుమార్ రోబోకు టీవీకే కండువా కప్పి ప్రచారం నిర్వహించారు. ఆ రోబో ఓటర్లకు చేతులు ఊపుతూ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం వైరల్ అయ్యింది.

అందరి రాజకీయ నాయకుల్లా ప్రతి జిల్లా చుట్టేయాలని కాకుండా.. తక్కువ ప్రచారంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలన్న వ్యూహంతో విజయ్ ముందుకెళ్లారు. ప్రచారం నిర్వహించిన ప్రతిసారీ హెడ్లైన్గా మారేలా చూసుకున్నారు.

అందరి రాజకీయ నాయకుల్లా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా జనాలకు అర్థమయ్యేలా తక్కువ స్పీచ్ ఆకట్టుకోవడంపై దృష్టిసారించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు నిర్వహించిన సభలో ‘నేను నటుడినే కానీ, రాజకీయాల్లో నటించడానికి రాలేదు’ అంటూ ఆవేశపూరితంగా ప్రసంగించడం ఇందుకు ఒక ఉదాహరణ.

విజయ్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికీ.. అభిమాన సంఘాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి విజయ్ అభిమాన సంఘాలు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఘాలే ప్రచార బాధ్యతను తలకెత్తుకున్నాయి. దీంతో విజయ్ ప్రచారానికి దూరంగా ఉన్నారన్న లోటు లేకుండా చూసుకున్నాయి.