భారత్ న్యూస్ గుంటూరు…పొగాకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం గట్టి భరోసా
- మార్కెట్ పరిస్థితులపై నిరంతర నిఘా పెట్టాలి
- పొగాకు రైతుల సమస్యలు, ఎరువుల పంపిణీపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి, జూన్ 26: వర్జీనియా (FCV) పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలాని, వర్జీనియా పొగాకు సాగు జరిగే జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పొగాకు కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కంపెనీలు నిర్ణయించిన నిబంధనలకు లోబడి పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా నిల్వలు, రవాణా, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, కృత్రిమ కొరత, నిల్వదాచివేత, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పొగాకు బోర్డు 168వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రి ప్రస్తావించారు. 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో FCV (Flue Cured Virginia) పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, FCV పొగాకు మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కొనుగోలు విధానంలో పారదర్శకత పెంచడం, పంట నియంత్రణ వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడం, రైతులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించడం కోసం అన్ని భాగస్వాములతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, ఖరీఫ్ రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.