భారత్ న్యూస్ గుంటూరు…రాజమండ్రి -కాకినాడ పోర్ట్ మధ్య డైలీ మెము రైలు ప్రారంభం
విజయవాడ డివిజన్ రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. రాజమండ్రి నుండి కాకినాడ పోర్ట్ మధ్య నడుస్తున్న స్పెషల్ మెము రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.. రైలు నంబర్ 67301 రాజమండ్రి – కాకినాడ పోర్ట్ మెము సర్వీసు ఏప్రిల్ 27 నుండి అందుబాటులోకి రానుండగా, తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 67302 కాకినాడ పోర్ట్ – రాజమండ్రి సర్వీసు ఏప్రిల్ 28 నుండి ప్రతిరోజూ ప్రయాణికులకు సేవలు అందించనుంది. షెడ్యూల్ వివరాల ప్రకారం రైలు నంబర్ 67301 రాజమండ్రిలో రాత్రి 10:40 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12:40 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 67302 కాకినాడ పోర్ట్ ఉదయం 6:15 గంటలకు బయలుదేరి ఉదయం 8:15 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. ఈ రైలు ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ రెగ్యులర్ మెము సర్వీసు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.
