గంజాయి బెట్టింగ్, బ్యాచ్లు రౌడీలకు విగ్రహాలు పెడతారా, సీఎం సీరియస్

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..గంజాయి బెట్టింగ్, బ్యాచ్లు రౌడీలకు విగ్రహాలు పెడతారా, సీఎం సీరియస్

సత్తెనపల్లిలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు

ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓ వైపు యోగా జరుగుతుంటే.. మరోవైపు రప్పా రప్పా అంటున్నారని మండిపడ్డారు. చంపండి.. నరకండి.. అని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లు, రౌడీలకు విగ్రహాలు పెడతారా అని నిలదీశారు.

‘ఇరుకు వీధుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా అని అడిగారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా అని ప్రశ్నించారు. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. రౌడీయిజం చేసేవారిని, చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలేయాలా అని నిలదీశారు. ఒక్కసారి ఉన్మాదులుగా మారితే వారిని మార్చగలమా అన్నారు. భవిష్యత్‌ను తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచించాలి’ అని సీఎం చంద్రబాబు కోరారు.

‘కొందరికి క్రైమ్ కూడా అలవాటు అయిపోయింది. అంతా యోగా చేస్తే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలని ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు రఫ్ఫా రఫ్ఫా అంటున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లుగా నరికేస్తాం అంటున్నారు. ఒకప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో దూరం పెట్టేవారు. ఇప్పుడు వారినే వెనకేసుకుని తిరుగుతున్నారు. మేము ఎప్పుడైనా పోలీసులు వద్దంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్లామా. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, అత్యాచారాలు చేసే వారికి విగ్రహాలు పెడుతున్నారు. ఏపీలో గంజాయి చాలా వరకు కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీం ఏర్పాటు చేశాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

‘గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. తాను చేసిందే చట్టం అంటే ఎలా కుదురుతుంది. మీరు మారాలి.. లేకుంటే ప్రజలు మార్చాలి. ఒకప్పుడు చెడ్డవారిని రాజకీయాల్లో దూరం పెట్టేవారు. ఇప్పుడు వారినే వెనకేసుకుని తిరుగుతున్నారు. వైసీపీ నేతలు సమాజానికే పెద్ద సమస్యగా మారిపోయారు. అన్ని నేరాల్లో వాళ్లే ఉంటున్నారు.. మళ్లీ రాజకీయం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శా. వైసీపీ హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. వైసీపీ నేతల వాహనం ఢీకొని చనిపోతే పట్టించుకోరా. రౌడీయిజం చేయాలని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. రైతులను పరామర్శించేందుకు 40మందితో వెళ్తారా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.