ఉక్కులో డీజీఎం రాజీనామా,

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉక్కులో డీజీఎం రాజీనామా

కాంట్రాక్టు సిబ్బందిని తగ్గించాల్సిందిగా

యాజమాన్యం ఒత్తిడి చేయడమే కారణం

విశాఖపట్నం

,స్టీల్‌ ప్లాంటులో మరో సీనియర్‌ అధికారి రాజీనామా చేశారు.

యాజమాన్యం ఒత్తిళ్లు భరించలేకే ఆయన సర్వీస్‌ నుంచి వైదొలగారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించగా స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆపరేషన్ల విభాగంలో ఆయన సేవలు అవసరమని యాజమాన్యం వీఆర్‌ఎస్‌ దరఖాస్తును తిరస్కరించింది. దాంతో ఆయన కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించాలని యాజమాన్యం ఆదేశించింది. దానికి ఆయన అంగీకరించలేదు. వారిని తగ్గిస్తే ఆ విభాగంలో అనుకున్న పనులు జరగవని, లక్ష్యం సాధించలేమని యాజమాన్యానికి తెలియజేశారు. కాంట్రాక్టు కార్మికులను తగ్గించకపోతే, రాజీనామా చేసి వెళ్లిపోవాలని యాజమాన్యం పేర్కొనడంతో ఆయన వెంటనే రాజీనామా చేసేశారని తెలిసింది.

కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్న యాజమాన్యం బాగా పనిచేసే అధికారులను సైతం తొలగించడం అన్యాయమని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి.