భారత్ న్యూస్ వరంగల్….. …..వెయ్యి ఏండ్లయినా బీఆర్ఎస్ మారదు
జీవన్ రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకి.. వైఎస్ అండతో రెండుసార్లు ఉద్యమ నాయకత్వంపై పోటీ చేసిండు
కేంద్రాన్ని బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనలే
గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్ మాట్లాడుతున్నడు
కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సీజన్ మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా సగం మందికి రైతు బంధు ఇయ్యలే
ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే ప్రజలు తీసి బొంద పెడుతరు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ :
వెయ్యి ఏండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ తొవ్వలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తోందని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయినయి నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని.. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బీఆర్ఎస్ పార్టీ మారదని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి.. ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందన్నారు. పార్టీల సెంట్రిక్ గా కాకుండా ప్రజల సెంట్రిక్ గా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే దానిని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు.
గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని అన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా అంటూ ఆయనతో సీఎం డీల్ మాట్లాడుకుంటున్నారని అన్నారు.

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ప్రజలు కదా ప్రశ్నించారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ఎలా చెప్తారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని ప్రశ్నించారు.