..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ అన్నదాతలకు శుభవార్త. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో చర్చించారు.
మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు.
తర్వాత మరో 20 రోజులకు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి గారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.