భారత్ న్యూస్ తిరుపతి…సత్కర్మ ఫలం…! (యధార్థగాథ)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇదిగో ! కార్తీకమాసం ఆరంభమవుతోంది. స్వామి అయ్యప్ప భక్తులకు మండల కాలారభానికి నాందీ వాచకమే కార్తీక మాసారంభం. మడలకాల వ్రతానికే కాదు , ఎలాంటి వ్రతా చరణకైనా శుభదాయకం కార్తీకమాసమే. ఒకసారి పార్వతీ దేవి పరమ శివుని అడిగిందట. “స్వామీ మీకు మాసాలలో ఏమాసం ఇష్టమని”. అందుకు పరమ శివుడు “కార్తీక మాసమే నాకు అన్నింటికన్నా ప్రీతికరమైనది. ఈ సమయంలో నన్ను సేవించే భక్తులను తప్పక కటాక్షిస్తానని” (కార్తీకపురాణం) అటువంటి ఉత్తమోత్తమ కాలలో ఆచరించే వ్రతాలలో కెల్లా ఉత్కృష్టమైనది శబరిగిరి యాత్రకై మాలధరించి , ఆచరించే మండల వ్రతం.
అంటే నలభై రోజులపాటు కఠిన బ్రహ్మచర్యంతో , రెండు వెళలా చన్నీటి స్నానాలతో , ఏకభుక్తంగా , నిర్మ , నిర్వికారమై. మనస్సుతో సర్వచరాచర సృష్టిలో భగవంతుని దర్శించి సదాస్వామి నామస్మరణతో కాలం గడిపే మహోన్నత వ్రతమిది. రాగ , ద్వేషాదులకు అతీతంగా , స్నేహ సాహార్ధతలతో కుత్సిత , కుతంత్ర భూయిష్టమైన యాంత్రిక జీవితం నుండి అంచెలంచలుగా ఎదిగి భగవత్సాన్నిధ్యం చేరడానికి వుపయోగించేదీ ఈ వ్రతం. జీవుడు పిపీలకం నుండి అంచెలంచలుగా ప్రాకి పరిణామ దశలో చివరిదీ. ఉన్నత మైనదీ మానవ జన్మ. ఈ జన్మలో మాత్రమే ఏ ప్రాణికి ఇవ్వని మేధస్సు , యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము భగవంతుడు మానవునికిస్తున్నాడు. కారణం జన్మరాహిత్యం పొందడానికిది చివరి అవకాశమన్న మాట. ఇక్కడ తప్పటడుగు వేస్తే అధమాధమ జన్మ ప్రాప్తించక తప్పదు. నియమబద్ధ మైన జీవితం గడుపుతూ. సద్వర్తనతో పదిమందికి తనకు గల పరిమితులలో సాయపడుతూ ప్రతిఫలాపేక్షమో , కీర్తిదాహమో , మరోదో ఆశించక కర్తవ్య పరాయణం చేయాలి. తాను చేస్తున్న కర్మ(పనుల)లో పదిమందికి ఉపయోగ పడేలా ఉండేలా చేయాలి. కాని దాని వలన ఇతరులకు బాధ , నష్టం , కష్టం కలిగెలా ఉండకూడదు. “గృహస్తు తన కర్తవ్యం సరిగ్గా నిర్వహించిన నాడు. అతను యోగులు , మునీంద్రులు వెళ్ళే మోక్షమార్గంలో వెళ్ళడానికి అర్హుడే” అన్నది మహనీయుల ఉవాచ. (వివేకానందుల కర్మయోగం
“నబి భీతిరణాద్యోపై స్యమే ప్యపరాఞ్మఖౄ| ధర్మ యుద్ధేమృతో వాపితే నలోకత్రయం జితమ్ ॥
67వ శ్లోకం. మహానిర్వాణ తంత్రం అష్టమోల్లాసం.
తాత్పర్యం:- “స్వదేశము కొరకు , స్వధర్మము కొరకు గానీ , యుద్ధ రంగమున ప్రాణమును బాయుగృహస్థుడు , ధ్యానముచే యేగి పొందు పరమ పదమునే పొందుచున్నాడు”. కనుక తన కర్తవ్య నిర్వహణలో సంసార సాగరంలో నున్న సాధారణ గృహస్తు అంచలంచలంగా నిలబడినప్పుడే అతనికి రక్తి , ముక్తి. ఇందు కొక ఉదాహరణగా ఒక కథ వుంది. అది మనమిక్కడ ముచ్చటించు కోవడంలో తప్పులేదు. ఒక ఊళ్ళో ఒక సుబ్బయ్య వుండేవాడు. మంచి ధనికుడు. పేరు ప్రఖ్యాతలు గలవాడు. వడ్డీ వ్యాపారి. మొహమాటం లేని నిఖార్సయిన వర్తకుడు.
గడువు ఏ మాత్రం తీరిన బాకీతాలుకు వ్యక్తుల ఆస్తిపాస్తులు ఎలాంటి యాదాక్షిణ్యాలు లేకుండా తన స్వాధీనం చేసుకొని అంచెలంచలుగా ఎదిగాడు. విపరీతమైన ధనార్జన చేసినా ఏనాడు పిల్లికి బిచ్చం పెట్టడం అటుంచి కాకికి ఎంగిలి చెయ్యి విదిల్చేవాడుకాదు. అంతటి పరమలోభి. ఇలాంటి వ్యక్తికి క్రమంగా వృద్ధాప్యం సమీపించింది. ఏరోజు కనీస పాప చింతనలేని సుబ్బయ్యకు వున్నటుండి పాప చింతపట్టుకుంది. జీవితంలో ఏనాడు ఎవ్వరికీ పట్టెడు సాయం చేయడం అటుంచి అందరిచేత ‘ఛీ’ అన్పించుకున్నతాను పరమపాపి , తనలాంటి వాడికి స్వర్గ సౌఖ్యాలనేవి కల. కనీసం తన జీవిత కాలంలో చేసిన పాపకర్మల తాలూకూ శిక్షలేమిటో దాన్నించి తప్పించు కునే దారేమిటో తెలిస్తే బాగుండుననుకున్నాడు. వెంటనే అనేక మందిని కలిసి తన మనసులోని మాట చెప్పి మార్గం చెప్పమన్నాడు. కానీ అందరూ కూడా చేసిన దుష్కర్మల ఫలం అనుభవించక తప్పదన్నారు. పాపం ఈ మాటతో సుబ్బయ్య మరీ డీలా పడిపోయాడు. తన పాప కృత్యాల తాలూకు శిక్షలు తన కళ్ళెదుట కరాళనృత్యం చేస్తున్నట్టనిపించ సాగింది. ఎలాగైనా దీనికి మార్గం చూపండని దారిన పోయే దానయ్యలను కూడా బ్రతిమాలడం మొదలుపెట్టాడు. అలా ప్రాధేయపడగా , పడగా ఓ కొంటె కోణంగి ఇలా సలహా యిచ్చాడు. “చూడండి సుబ్బయ్యగారు మీ సమస్యకు ఒకటే దారి మీ పాప పుణ్యాల చిట్టూ చూసేది చిత్ర గుప్తులవారు. మీరు ఆయనను ప్రసన్నంచేసుకొంటే ఆయనే ఏదో దారిచూపగలరు” అన్నాడు. ఈ మాట సుబ్బయ్య మనసులో బాగా నాటుకుంది.
అంతే ఆ రోజునుండి నిద్రాహారాలు మానివేసి ఒకగదిలో పద్మాసనం వేసుకొని “ఓం చిత్ర గుప్తాయనమః” అంటూ ప్రార్థించడం మొదలు పెట్టాడు. నిశ్చలమైన మనస్సుతో కొంతకాలమిలా ప్రార్థించడంతో చివరికది చిత్ర గుప్తులవారి చెవిన పడింది. ఆయనకు అమిత ఆశ్చర్యం వేసింది. “భూలోకం నుండి ఇలా తనను ధ్యానించేవారెవరబ్బా. ఇదేదో చూడవల్సిందే” ననుకొంటూ ఆరాత్రి ఆయన సుబ్బయ్యముందు ప్రత్యక్షమయ్యాడు. సుబ్బయ్యకు ఆయన్ని చూడగానే పరమానందమైంది. “స్వామి అనుగ్రహించావా” అంటూ సాష్టాంగ పడ్డాడు. చిత్రగుప్తులవారికి పాపం ఏం చేయాలో తోచక *”వత్సా ! లే ! నీకేం కావాలి.
నన్నెందుకు ప్రార్థించావు. ఎవరు కూడ నాపేరైనా తలవరే”* అన్నాడు. సుబ్బయ్య “స్వామి ! మీ నుంచి నాకో సాయంకావాలి. నేను జీవిత కాలమంతా నాకు తెలిసి పాపకృత్యాలే చేసాను. నాకు తెలియక ఏదైనా మంచి చేసానో లేదో తెలియదు. కనుక నా చిట్టాకాస్త చూసి ఆ వివరాలు నాక్కొంచెం చెప్పాలి” అన్నాడు లౌక్యంగా. తెలుసుకుని ఏం చేస్తావునాయనా” అని అడిగాడు చిత్రగుప్తుడు.
శిక్ష ఏమిటో తెలిస్తే నివారణోపాయం కనుక్కోవచ్చు కదా స్వామి” అన్నాడు. సుబ్బయ్య. “సరే ! రేపు ఆ వివరాలు నీకందిస్తాను” అంటూ చిత్ర గుప్తులవారు వెళ్ళి పోయారు. మరుసటిరోజు సుబ్బయ్య చిత్ర గుప్తులవారి రాక కోసం ఆత్రంగా ఎదురుచూడసాగాడు. అన్నట్లుగానే చిత్రగుప్తుడు వచ్చాడు. సుబ్బయ్య ను చూడగనే ఆయన నవ్వుతూ “సుబ్బయ్య ! నీ చిట్టా చూశానయ్యా. ఎం లాభం లేదు. నీవు జీవితంలో చేసినవన్నీ ఘోరకృత్యాలే. ఒక్కటంటే ఒక్కటి కూడ మంచిపని చేయలేదు. నీ కోసం నరకంలో ఘోర శిక్షలు ఎదురు చూస్తున్నాయి” అన్నాడు. సుబ్బయ్య గుండె చేజారైంది. ధైర్యం చిక్కపట్టుకొని “పోనీ ఇప్పుడేమైనా మంచి పనులు చేస్తే” అన్నాడు ఆశగా. “దానికీ వీలుకాదయ్యా ! సరిగ్గా నెలనాటికి నీ ఆయుర్థాయం పూర్తి అవుతుంది. ఈ నెలలో నీవుచేసే కొన్ని మంచి పనుల వలన నీ జీవితమంతా చేసిన పాపం తేలను గదా”? అన్నాడు చిత్రగుప్తుడు సానుభూతిగా. “అయితే బయట పడేమార్గమేలేదా”? అన్నాడు నిస్పృహగా సుబ్బయ్య. ” ఈ చివరిదశలో ఎలా బైట పడగలవయ్యా ! అసాధ్యం ! అన్నాడు చిత్రగుప్తుడు. *”ఏదైనా ఉపాయం చెప్పుదురని ఆశతోనే స్వామి నిన్ను ప్రార్థించింది” అన్నాడు సుబ్బయ్య. నెపం చిత్రగుపుత్తడి మీద పెడ్తూ.
“చెయ్యాలనే వుందయ్యా ! కాని మీ భూలోకంలోలా చిట్టాలవీ మార్చడానికి లేదే” దీర్ఘంగా ఆలోచించాడు చిత్రగుప్తుడు. చివరికిలా అన్నాడు. “ఒక్కపని చేస్తే కొంతలో కొంతమేలు జరగచ్చు. ఈనెలరోజులు శ్రమించి నీవు పది మందికి ఉపయోగపడేలా బావో , చెరువో త్రవ్వించు. కొంత పుణ్యం దొరకుతుంది. యమధర్మరాజుల వారు నీ కొచ్చిన పుణ్యంతో ముందుగా స్వర్గానికి వెళ్ళిన తరువాత నరకలోక శిక్షలనుభవిస్తావా లేక ముందుగా శిక్షలనుభవించి తర్వాత స్వర్గానికి వెళ్ళెదవా” అని అడుగుతారు. “నీవు మొదట స్వర్గానికి వెళుతాను అను. తర్వాత ఎలా అయితే అలా అవుతుంది” అని పలికి అదృశ్యమయ్యాడు. సుబ్బయ్య మరుసటిరోజే కావల్సినంతమంది మనుష్యులను పిలిపించి నలుగురికీ అందుబాటులో వున్నచోట ఒకపెద్ద కోనేరు నిర్మించాడు. దిగడానికి నాలుగు వైపులామెట్లు కట్టించాడు. చుట్టూ గట్టు మీద నాలుగు వైపులా సిమెంటు బెంచీ లేర్పాటు చేశాడు. చుట్టూ పూలమొక్కలు , పండ్ల చెట్లు పెద్ద నీడ నిచ్చే చెట్లు నాటించాడు.
అంతే ఆయన గడువు తీరిపోయింది. యమభటులు వచ్చి సుబ్బయ్యను తిన్నగా యమధర్మరాజు ముందుకు తీసుకెళ్ళారు. యమధర్మరాజు చిత్రగుప్తుడితో సుబ్బయ్య పాప పుణ్యాల చిట్టా చూడమన్నాడు. చిత్ర గుప్తుడు మొత్తం చూసి “అయ్యా ఈతడు పరమపాపి. అన్నీ పాపకృత్యాలే చేశాడు. అన్యులను బాధపెట్టి విపరీతంగా ధనమార్జించాడు. ఆ ధనాన్నంతా లోభియైదాచు కున్నాడు. కాని గుడ్డిలో మెల్లగా చనిపోడానికి ముందు ఒక జలాశయం నిర్మించాడు. అప్పుడే కొని పశుపక్ష్యాదులు , మనుషులు దాహశాంతి చేసుకొన్నారు. దరిమిలా ఈయనకు కొంత పుణ్యం వచ్చింది. దాని ఫలంగా ఈయన ఒక నెల రోజులు స్వర్గ సుఖాలను భవించవచ్చు” అన్నాడు. అప్పుడు యమధర్మరాజు “సుబ్బయ్యా ! ముందు నరకమా లేక స్వర్గవాసమా ఏది కావాలి” అని అడిగాడు. సుబ్బయ్య తడుముకోకుండా నాకు స్వర్గవాసమే ముందూగ దయచేయించడం” అన్నాడు. అలాగేనంటూ యమధర్మరాజు భటులు పిలిచి సుబ్బయ్యను స్వర్గంలో వదలిరమ్మన్నాడు. సుబ్బయ్య స్వర్గంలో నెలరోజులు గడిపాడు. తిరిగి సుబ్బయ్యను నరకానికి పిలువవల్సిందిగా యమ ధర్మరాజు ఆదేశించాడు. కాని సుబ్బయ్య తవ్వించిన జలాశయంలో ఇప్పుడు ఎందరో దాహశాంతి తీర్చుకోవడమే కాక పదిమంది సాయం వేళలో అక్కడే విశ్రాంతిగా కూర్చుంటున్నారని వారందరూ ఇలాంటి ఏర్పాటు చేసిన సుబ్బయను ఆశీర్వదిస్తున్నారని కనుక మరి రెండు నెలలపాటు సుబ్బయ్య స్వర్గంలో వుండవచ్చని చిత్ర గుప్తుడు చెప్పాడు. ఇలా జరుగగా , జరుగగా కోనేటి ప్రక్కనున్న చెట్లన్నీ పెద్దవై అక్కడ ఎండకు నడిచి వచ్చే బాటసారులకు నీడ , కోనేటిలోని చల్లని నీళ్ళనూ అందించడమే గాక అసంఖ్యాకమైన పక్షులకు నివాస సౌకర్యం గూడ అందించ సాగాయి. పశువులు , మనుష్యులు ఆ నీటిని యదేచ్చగా వాడుకోసాగారు.
పిల్లలంతా సాయం వేళలో ఆడుకోసాగారు. నడిచివచ్చిన వారు కోనేటిలో కాళ్ళు , చేతులూ కడుక్కుని చల్లని నీటిని త్రాగి చెట్లనీడలో , చల్లటి గాలిలో సిమెంటు బెంచీల మీద విశ్రాంతి తీసుకుంటూ “ఏ మహానుభావుడుకట్టించాడో గానీ పది కాలలపాటు సుఖంగా వుండాలి” అని ఆశీర్వదించే వాళ్ళు. క్రమక్రమంగా సుబ్బయ్య స్వర్గం వదలినరకానికి రావల్సిన అవసరమే కలుగలేదు. ఇదీ కథ. ఈ కథలో కాస్త అతిశయోక్తి వున్నా ఒక పరమరహస్యం దాగివుంది. ఎన్నోదుష్కర్మల ఫలం కూడా పదిమందికి ఉపయోగపడే ఒక సత్కర్మ వలన పోగొట్టుకోవచ్చు అన్నది.
అలాంటప్పుడు మనకు భగవంతుడిచ్చిన ఆయుర్థాయంలో సాధ్యమైనన్ని సత్కర్మలుచేస్తే , చేసి ఫలాన్ని నిరామయంగా భగవంతునికి అర్పిస్తే అదే మనకు రక్తి, ముక్తి , ఇలా చెప్తుంది.
“జలాశయాశ్చ వృక్షాశ్చ విశ్రమగృహమధ్వని
సేతుః ప్రతిష్ఠతో మేన తేన లోక ర్తయంజితమ్ ॥ (63 శ్లోకం, మహా నిర్వాంతంత్రమ్, అష్టమెల్లాసమ్ ॥)

తాత్పర్యం : చెరువులను త్రివించుచూ , బాటలు కిరువైపులా చెట్లను నాటించుతూ , మానవులకును , జంతువులకును గూడ విశ్రాంతి మందిరములు నిర్మించుతూ , బాటలను వేయించుతూ , వంతెనలను గట్టించుతూ గృహస్థుడు యోగీంద్రులకు లబ్యమగు నుత్తమ గతిని పొందుచున్నాడు. కనుక ఇటువంటి సత్కర్మలు చేయాలంటే మొట్ట మొదట కష్టతరంగా వుండవచ్చు. స్వార్ధం అవరోధం కావచ్చు. కానీ కొద్దిగా త్యాగగుణం అలవర్చుకుంటే అది అసాధ్యమేమీ కాదు. అందుకు కాస్త పరిశ్రమ గూడ కావాలి. అలాంటి పరిశీలనే మనకు మండల కాలం అందిస్తుంది. స్వార్థాన్ని జయించేమార్గం , కోర్కెలను అణిచేరీతి , అహాన్ని వదలివేసి పద్ధతి మనకు క్రమంగా కరతలామలకమవుతుంది. అంచెలంచెలుగా మనలను ఉత్తమ మార్గం వైపు తద్వార ఉత్తమ కర్మలవైపు నడిపిస్తుందీ వ్రతం. తద్వారా వచ్చేస్పూర్తితో ఆ చంద్రార్కమూ నిలువగలిగే పనులను చేయనూవచ్చు. కనుక నూతన దృక్పధంతో మాలాధారణ చేసుకోబోయే కన్నిస్వాములారా , పళమ స్వాములారా , పెరియ స్వాములారా , గురుస్వాములారా వ్రతాచరణలో ఇది గుర్తించుకొని సత్కర్మలనే ఆచరించి భగవంతునికి ప్రీతి పాత్రమైన రీతిలోనే నడుస్తామని ప్రతిన బూని శపథం చేయండి. ఆదారిలో నడవండి. మరికొందరికి మీరు ఆశయ స్పూర్తి నివ్వండి. తద్వారా మానవ కల్యాణానికి పాటు పడడమే కాక మోక్షసిద్ధి కూడ పొందవచ్చు. ఇంతటి మహత్తాశయంగల శబరిగిరి నాథుని మండల కాల వ్రతంలో మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఆ జితేంద్రియుడు మనకు సర్వదా శక్తినీ స్ఫూర్తినీ ఇవ్వవలెనని మనసారా ప్రార్థించు కొందాము.