భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
దిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది.
2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం, జోన్ అంతటా 17వేల మంది వరకు పనిచేస్తారు.