భారత్ న్యూస్ హైదరాబాద్…అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి
-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్
హైదరాబాద్, (నేషనల్ న్యూస్: ప్రతినిధి.అశోక్ గౌడ్ పొట్లపల్లి) మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు
(డీపీఆర్వో)లను ప్రతివాదులుగా చేర్చారు.

అక్రెడిటేషన్ కమిటీల జీవో 229 రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మీడియా అక్రెడిటేషన్ల జీవో 252 కి అనుబంధంగా రాష్ట్ర, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో ఆర్టీ 229 ను నిబంధనలకు విరుద్దంగా అమలు చేసినందున ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టు లో మంగళవారం పిటిషన్ దాఖలైంది. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు అనే జర్నలిస్టు జీవో 229 అమలు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అక్రెడిటేషన్ కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఉండాలని జీవో 252లో పేర్కొనగా, జీవో ఆర్టీ 229 ద్వారా కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే తీసుకున్నారని, టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ప్రతినిధులను కమిటీల్లోకి తీసుకోకుండా కమిటీ నిర్ణయాలు చేయడం జీవో 252 కు విరుద్దమని, అందుకని ఈ జీవో ఆర్టీ 229ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ లో కూడా ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ ను, మీడియా అకాడమీ ఛైర్మన్,అన్ని జిల్లాల డీపీఆర్వోలను ప్రతివాదులుగా చేర్చారు.