అక్షయ తృతీయ సందర్భంగా.

భారత్ న్యూస్ విజయవాడ… అక్షయ తృతీయ సందర్భంగా……….!!
తృతీయను పంచాంగకర్తలు తదియ అని వ్యవహరిస్తారు. తృతీయకు వికృతి తదియ. విదియనాడు కనపడని చంద్రుడు, తదియనాడు తానే దర్శనమిస్తాడన్నది సామెత! తృతీయ మూడోతిథి. మూడో సంఖ్య మానవుడిలోని సృజనాత్మక శక్తికి గుర్తు. లోహాల్లో స్వర్ణానికి సంకేతం. అనిర్వేదవాదానికి, అదృష్టానికి మూడో సంఖ్య కీలకమైంది. త్రినేత్రుడికి ఉన్న మూడో కంటికి ఎంతటి శక్తి ఉందో మూడో సంఖ్యకు అంతటి శక్తి ఉందని శివపురాణంలోని వ్యాఖ్య!

పరశురాముడి జన్మతిథి వైశాఖ శుక్ల తృతీయ. వ్యాసుడు చెబుతుండగా, వినాయకుడు ఒక్క క్షణమైనా ఆపకుండా మహాభారతం రాయడం ఈ తిథి నుంచే ప్రారంభమైంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు సవిత్రుడు (సూర్యుడు) అక్షయపాత్ర ప్రసాదించింది వైశాఖ శుక్ల తృతీయ రోజేనన్నది ఐతిహ్యం. శుభమైన, మంగళమైన, శ్రేయస్కరమైన తిథి అని స్కాందపురాణంలో ఉంది. అందుకే అక్షయ తృతీయను సర్వసిద్ధి ముహూర్తమని వ్యవహరిస్తారు. ఈ రోజు సూర్యుడు, చంద్రుడు ఉన్నత స్థితిలో ఉంటారు. పంచాంగ కర్తలు అక్షయతృతీయను శ్రేయస్కరమైన ముహూర్తమని చెబుతారు. వైశాఖమాసంలో శుక్రుడు శభపరిణామాలు కల్పిస్తాడు. వైశాఖ శుక్ల తృతీయ రోజు శుక్రుడు మహర్దశలోకి చేరుతాడు. ఈ రోజు ఏ పనులు తలపెట్టినా అవిఘ్నంగా పూర్తి అవుతాయన్నది నమ్మకం. ఈ రోజు ప్రత్యేకమైన శుభఘడియలకోసం అన్వేషించాల్సిన అవసరం లేదని జ్యోతిష్కులు అంటారు. ఎందుకంటే ఈ రోజంతా శుభప్రదమైందే! అక్షయ అంటే క్షయంకాని అని అర్ధం. ఈ రోజు ఏది నిర్మించినా, మరేదీ కొన్నా, ఇంకా ఏ పని ప్రారంభించినా అది శాశ్వతమై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాశ్వతమే కాక అభివృద్ధి, విజయం కలుగుతుందని అంటారు. త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి, సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా హనుమ కుదిర్చిన స్నేహం వైశాఖ శుక్ల తృతీయ రోజేనని తులసీరామాయణంలో ఉంది. అందుకే వారి మైత్రీబంధం అంత శాశ్వతమై పరిఢవిల్లింది.

ఈ రోజు బంగారం ధరించి లక్ష్మీదేవిపూజ చేయాలని అంటారు. లక్ష్మీదేవి స్వర్ణానికి అధిదేవత. అందుకే శ్రీశంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో…

‘దిగ్హస్తభిః కనక కుంభముఖావ సృష్ట
స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం’
అని స్తుతిస్తారు.

అందుకే ఎందరో ఆశావహులు అక్షయతృతీయ రోజు బంగారం: కొనుగోళ్లు చేస్తారు. ముత్తెమంత (ముత్యమంత) బంగారం అయినా అక్షయ తృతీయ రోజు కొనాలన్నది ఒక నమ్మకం. దుర్గాసప్తశతి (మూక శంకరులు) లో దుర్గాదేవిని స్తుతిస్తూ దుర్గామాత మహిషాసురుణ్ని సంహరించింది. వైశాఖ శుద్ధ తృతీయ రోజేనని ప్రస్తావించారు. సాందీపనిముని వద్ద శిష్యరికం చేసిన ఎన్నో ఏళ్ళ తరవాత సుధాముడు శ్రీకృష్ణుణ్ని చూడడానికి వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు వెళ్లి, తృతీయ రోజు తిరుగుప్రయాణమయ్యాడు. ఈ మూడురోజులు శ్రీకృష్ణుడు సుధాముడి సాంగత్యం వీడక తన పనులన్నీ పక్కనపెట్టి దివ్యత్వమైన చెలిమిని ప్రదర్శించాడు. అక్కడి భోగభాగ్యాలు చూసి తాను మూటకట్టుకొని తెచ్చిన అటుకులను సిగ్గుపడుతూనే, తిరుగుప్రయాణం ముందు తన కానుకగా శ్రీకృష్ణుడికి అందజేస్తాడు. అదే గొప్ప కానుకగా అందుకొని, ఆ అటుకులను తిని శ్రీకృష్ణుడు సంతోషంతో సుధాముణ్ణి సాగనంపుతాడు. ఆ రోజు వైశాఖ శుక్ల తృతీయ. ఇంటికి తిరిగి వచ్చిన సుధాముడి ఇల్లంతా స్వర్ణమయం అయిపొయింది. అదీ అక్షయ తృతీయ మహిమ.

ఈ రోజు కుబేరునితోపాటు శ్రీమహాలక్ష్మిని సైతం పూజించాలని ఆగమ విధానాలు తెలుపుతున్నాయి. వీరిద్దరూ సంపదలకూ, సర్వసిద్ధులకూ ప్రతీకలు. శ్రీలక్ష్మీ యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతి సందర్భంలో ఎంతో కొంత బంగారాన్ని అగ్నికి ఆహుతి చేయడం వల్ల రానున్న జన్మలో సిరులు ఉన్న ఇంట్లో జన్మించేట్టుగా వరలక్ష్మి వరం ప్రసాదిస్తుందని యజుర్వేదం చెబుతోంది. ‘ఇచ్చే చేతికే తీసుకోవడం సాధ్యం అవుతుంది’ అనేది ఆర్యోక్తి. ఈ విశ్వం చాలా రహస్యమైంది, దాని మార్మిక నియమాలు దానికి ఉన్నాయి. ప్రాపంచిక విజయాలను సొంతం చేసుకోవాలంటే ముందు స్వచ్ఛమైన హృదయంతో ఇవ్వాలి అనేది ముఖ్యమైన రహస్యాలలో ఒకటి, మనం ఆశించక పోయినా దానం చేసింది మరింత ఎక్కువ వెనక్కి వస్తుంది. ఏదైనా పొందడం కోసం ఏదైనా ఇవ్వడం అనే పురాతన శాస్త్రవిధిని పవిత్రమైన “అక్షయ తృతీయ” లేదా “స్వర్ణ దినం” రోజున ఆచరించడం గొప్పది. వైశాఖ మాస శుక్ల పక్ష తదియ రోజున దానాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సూర్య చంద్రులు శక్తివంతంగా ఉండే ఈ రోజు దానధర్మాలకు, పుణ్యకార్యాలకు చాలా ముఖ్యమైంది.

ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడమే కాదు. చేసే దానాలు సైతం అక్షయాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ తెచ్చుకోవడానికే కాదు, ఇవ్వడానికి కూడా అని తెలుసుకోవాలి. ఈ రోజు దానం ఇస్తే గ్రహదోషాలు, పూర్వకర్మ ఫలితాలు తొలగిపోతాయి.