Telangana: నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు!

భారత్ న్యూస్ వరంగల్ …Telangana: నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

జనరల్ మరియు ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు మే 24 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 3,98,358 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుండి 2,67,285 మంది, రెండో సంవత్సరం నుండి 1,31,073 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 10,685 మంది ఇన్విజిలేటర్లను మరియు 75 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను కళాశాలల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఒకవేళ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా డౌన్‌లోడ్ చేసిన కాపీతో పరీక్షకు అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అయితే, విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బోర్డు హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ వస్తువులైన సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదు. విద్యార్థుల సౌకర్యార్థం నిరంతర విద్యుత్, తాగునీరు మరియు ప్రాథమిక వైద్య సహాయం అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం ‘టెలీ-మానస్’ (14416) టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కౌన్సెలింగ్ సేవలను కూడా ప్రభుత్వం అందిస్తోంది.

పరీక్షల షెడ్యూల్ వివరాలు

మే 13: సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-I & II)

మే 14: ఇంగ్లీష్ (పేపర్-I అండ్ II)

మే 15: మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ / మ్యాథ్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్

మే 16: మ్యాథ్స్-1B, జువాలజీ, హిస్టరీ / మ్యాథ్స్-2B, జువాలజీ, హిస్టరీ

మే 18: ఫిజిక్స్, ఎకనామిక్స్ (పేపర్-I & II)

మే 19: కెమిస్ట్రీ, కామర్స్ (పేపర్-I & II)

మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (BiPC విద్యార్థులకు)

మే 21: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ (పేపర్-I & II)