vibhavanga shri padmavati ammavari panchami theertha

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

  • క‌నుల‌విందుగా సిరులతల్లికి  స్న‌ప‌న‌తిరుమంజ‌నం 
  • పద్మపుష్కరిణిలో పవిత్రస్నానంతో భక్తుల తన్మయత్వం
  • అసంఖ్యాకంగా పాల్గొన్న భక్తులు
  • అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల సేవలను అభినందించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

  తిరుపతి( భారత్ న్యూస్ )  శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. 

    ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు. ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని,  సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో శ్రీ ధర్మారెడ్డి నేతృత్వంలో

అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

     అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 

అమ్మవారికి శ్రీవారి కానుక 

      శ్రీ  పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ  వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీ సుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా సిరులతల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

 పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో  విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకులు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాల‌లు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. తిరుపూర్ కు చెందిన దాతలు అమ్మవారి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.