ఆ ఛానెల్ మాకు సంబంధం లేదని తప్పించుకోలేదు – పవన్ కళ్యాణ్ వార్నింగ్.

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor.ఆ ఛానెల్ మాకు సంబంధం లేదని తప్పించుకోలేదు – పవన్ కళ్యాణ్ వార్నింగ్.

ఏపీ రాజధాని అమరావతితోపాటు ఆ ప్రాంతానికి చెందిన చెందిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాక్షి ఛానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పవన్…రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమరావతి ప్రాంతంపై ఒక ఛానెల్ లో విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని పేర్కొన్నారు. ఆ ఛానెల్ కూడా… ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక… నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్నీ అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు పవన్ కళ్యాణ్.

అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని చెప్పుకొచ్చారు. కులముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారని, రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ.. 14 శాతం బీసీ రైతులు ఉన్నారని వివరించారు. అమరావతిపై కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా, వారి వెనుక ఉన్నవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. నీచ వ్యాఖ్యలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళతారు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..