భారత్ న్యూస్ శ్రీకాకుళం….రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
- రొయ్యల రైతులపై అదనపు భారం మోపే విధంగా ఫీడ్ ధరల పెంపు సమంజసం కాదన్న మంత్రి
- పెంచిన ధరలను వెంటనే నిలిపివేయాలని ఫీడ్ కంపెనీలకు నోటీసులు జారీ
- రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, మే 12: రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనామీ ఫీడ్‌పై కిలోకు రూ.8, టైగర్ రొయ్యల ఫీడ్‌పై కిలోకు రూ.10 పెంచినట్లు సమాచారం అందిందన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు. APSADA చట్టం ప్రకారం రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు ఆ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ, ధరల పెంపును అమలు చేయడం సమంజసం కాదన్నారు. రైతుల ఆందోళనలు, సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని సంబంధిత ఫీడ్ తయారీ సంస్థలకు ఫిషరీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో నేడు (బుధవారం) ఉదయం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.