భారత్ న్యూస్ గుంటూరు…60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,
CEIR పోర్టల్ ద్వారా మూడు నెలల కాలంలోనే 400 మొబైల్ ఫోన్ల రికవరీ
క్రైమ్ న్యూస్ కృష్ణా :
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేస్తే, దానిని గుర్తించి తిరిగి అందించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ పేర్కొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవితంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సేవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక అవసరాలకు మొబైల్ ఫోన్ కీలక సాధనంగా మారిందని తెలిపారు. అలాంటి మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం, దొంగతనానికి గురికావడం లేదా ఇతర కారణాలతో కోల్పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.
ప్రజలకు త్వరితగతిన సహాయం అందించాలనే లక్ష్యంతో CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందిస్తున్నామని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన లేదా ఇతర కారణాలతో కోల్పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించేందుకు CCS ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ టీం ఐటీ కోర్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ CEIR పోర్టల్ ద్వారా IMEI వివరాలను విశ్లేషించి, వివిధ ప్రాంతాల్లో గుర్తించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించడంలో విశేష కృషి చేస్తోంది.
ఈ ప్రత్యేక చర్యల ఫలితంగా కేవలం మూడు నెలల కాలంలోనే మొత్తం 400 మొబైల్ ఫోన్లు, సుమారు రూ.60 లక్షల విలువైన వాటిని రికవరీ చేయడం జరిగింది. వీటిలో:
మచిలీపట్నం CCS – 100
పెనమలూరు CCS – 63
గుడివాడ CCS – 237 మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
ఈ మొబైల్ ఫోన్లను ఈరోజు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్‌లో కూడా వివరాలు నమోదు చేయాలి. దీంతో మొబైల్‌ను బ్లాక్ చేయడంతో పాటు గుర్తించి తిరిగి అందించే ప్రక్రియ వేగవంతమవుతుంది. ప్రజల ఆస్తుల రక్షణకు కృష్ణాజిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
మొబైల్ ఫోన్లు తిరిగి అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులను అభినందించారు.