ప్రమాదానికి గురైన విద్యార్థిని పూజితను పరామర్శించిన కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ గుంటూరు…ప్రమాదానికి గురైన విద్యార్థిని పూజితను పరామర్శించిన కనపర్తి శ్రీనివాసరావు

మోపిదేవి / మచిలీపట్నం: పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి, దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని మత్తి పూజితను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు.మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన పూజిత, స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదువుతూ ఇటీవలే విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. అయితే, ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ చిన్నారి ప్రస్తుతం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కనపర్తి శ్రీనివాసరావు ఇతర నాయకులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి పూజిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూజిత సాధించిన విజయాన్ని అభినందిస్తూ, ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చదువులో రాణిస్తున్న ఇలాంటి విద్యార్థినికి ప్రమాదం జరగడం బాధాకరమని, తమ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని కనపర్తి భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మోపిదేవి జెడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,మోపిదేవి ఎంపీటీసీ కొమ్ము పవన్ కుమార్,మోపిదేవి మండల కో-ఆప్షన్ సభ్యుడు చందన రంగారావు తదితరులు పాల్గొన్నారు