1975 జూన్ 25న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు.

భారత్ న్యూస్ రాజమండ్రి…1975 జూన్ 25న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. దేశ చరిత్రలోనే (ఆర్టికల్ 352) అంతర్గత అశాంతి/అలజడి” (Internal Disturbance) అనే కారణంతో విధించిన మొదటి అంతర్గత ఎమర్జెన్సీ ఇది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, చీకటి కాలంగా పరిగణించబడుతుంది. ఈ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు దాదాపు 21 నెలల పాటు కొనసాగింది. పౌర స్వేచ్ఛలు రద్దయ్యాయి, మీడియాపై సెన్సార్‌షిప్ విధించబడింది, విపక్ష నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్భంధించారు.

దేశ భద్రతకు ముప్పు కారణంగా ఎమర్జెన్సీ విధించినట్లు ప్రకటించినప్పటికీ అసలు కారణం మాత్రం 1971 లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడ్డారని సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది.

దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ లోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించడమే కాకుండా, ఆమెను ఎంపీ పదవి నుండి తొలగించి, 6 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

ఈ తీర్పుతో దేశంలో ఇందిరా గాంధీ రాజీనామా చేయాలనే నిరసనలు, రాజకీయ అలజడి తీవ్రమయ్యాయి. తన పదవిని కాపాడుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ విధించారని చెబుతారు. తత్ఫలితంగా తరువాత జరిగిన 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సంఘటన భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఒక మలుపుగా గుర్తించబడింది.