ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలి

భారత్ న్యూస్ విజయవాడ…ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలి

మగ్గం లేని అనుబంధ కార్మికులను పరిగణలోనికి తీసుకోవాలి

వైయస్ఆర్సిపి మండల యూత్ అధ్యక్షుడు వెనిగళ్ళ తారక జగదీష్ డిమాండ్

చల్లపల్లి:
కేవలం మగ్గం ఉన్న చేనేత కార్మికులకే కాక మగ్గం లేకపోయినా చేనేతపై ఆధారపడి జీవిస్తున్న అనుబంధ కార్మికులకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చల్లపల్లి మండల యూత్ అధ్యక్షుడు వెనిగళ్ళ తారక జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి చల్లపల్లి పడమర వీధిలోని చేనేత కార్మికుల కుటుంబాలను కలిసి వారి స్థితిగతులపై ఆరాతీసారు. ఈసందర్భంగా చేనేత అనుబంధ కార్మికులు వారి సమస్యలు జగదీష్ ఎదుట ఏకరువు పెట్టారు. ప్రస్తుతం మగ్గం ఉన్న వారికి మాత్రమే ఉచిత కరెంటు పథకాన్ని వర్తింప చేస్తున్నారని చెప్పారు. ఒక కుటుంబానికి చెందిన మగ్గంపై చీర తయారై బయటకు రావాలంటే దానిని 15 పద్ధతుల్లో ప్రాసెస్ చేయాలని దీనికి అనుబంధంగా 20 నుంచి 30 మంది వరకు అనుబంధ కార్మికులు పనిచేస్తారని వివరించారు.
కూటమి ప్రభుత్వం కేవలం మగ్గం ఉన్న ఒకరిద్దరికి మాత్రమే ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపజేసి మిగిలిన అనుబంధ కార్మికులుగా ఉన్న 20 నుంచి 30 మందిని పట్టించుకోవటం లేదని వారి గోడును విన్నవించారు. అనంతరం జగదీష్ మాట్లాడుతూ చేనేత రంగంలో మగ్గం నేసే వారి కంటే దానిమీద పనిచేసే అనుబంధ కార్మికులే ఎక్కువుగా ఉంటారని వారిని వదిలేసి తూతూ మంత్రంగా ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయాలని చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతి చేనేత కార్మికునికి ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండు చేశారు. నాడు వైయస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా రూ.25 లు ఇచ్చారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుజ్జువరపు భాగ్యారావు, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగు రమేష్, పార్టీ నాయకులు వైసిపి మండల ఉపాధ్యక్షుడు పాగోలు నాగసీతారామరావు(ఫణి), దుట్టా రమణ, బొందలపాటి మార్కేండుయులు, మిరియాల శ్రీనివాసరావు, ఆకుల పాండు, మిరియాల కృష్ణ, బూసం వీరయ్య, జక్కల శ్రీహరి, చేనేత అనుబంధ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.