భారత్ న్యూస్ విజయవాడ…KDCC బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ – నాణ్యతలో అగ్రగామిగా కొత్త గుర్తింపు
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) సేవల నాణ్యతలో విశేష ప్రగతి సాధిస్తూ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (International Organization for Standardization – ISO) నుంచి ISO 9001:2015 సర్టిఫికేషన్ పొందడం ద్వారా బ్యాంక్ తన నాణ్యతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకుంది.
ఈ సర్టిఫికేషన్‌ను ఈ రోజు KDCC బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ISO సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాకుండా, బ్యాంక్‌లో అమలు చేస్తున్న వ్యవస్థలు, పారదర్శకత, సేవల ప్రమాణాలు మరియు వినియోగదారుల సంతృప్తికి ప్రపంచ స్థాయి ముద్ర అని పేర్కొన్నారు.
“ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం మా బ్యాంక్‌కు గర్వకారణం. ఇది మా సేవల నాణ్యతకు అంతర్జాతీయ గుర్తింపు. రైతులు, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే మా నిబద్ధతకు ఇది ప్రతిఫలం,” అని నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో సహకార రంగాన్ని ఆధునీకరించడంలో KDCC బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని PACSలను డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేసి, UPI, PhonePe వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) ద్వారా వడ్డీ మాఫీ వంటి పథకాలను అమలు చేసి వేలాది మంది రైతులకు ఉపశమనం కల్పించామని వివరించారు.
ISO సర్టిఫికేషన్ సాధించడం ద్వారా KDCC బ్యాంక్ రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలోనూ సహకార బ్యాంకింగ్ రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో మొట్టమొదటిగా ISO సర్టిఫికేషన్ పొందడం ఒక విశేష ఘట్టమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చైర్మన్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ CEO శ్రీ శ్యామనోహర్ గారు మరియు ISO ప్రతినిధులు పాల్గొన్నారు.