భారత్ న్యూస్ విశాఖపట్నం..శనగ రైతులకు ఊరట…కేంద్రం అనుమతితో కొనుగోలు పెంపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో కేంద్రం గ్రీన్ సిగ్నల్
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి అచ్చెన్న
- మిగిలిన శనగలను కూడా త్వరలో కొనుగోలు చేయిస్తాం, రైతులు ఆందోళన చెందొద్దు
- క్రాప్ డైవర్షన్ వల్ల మొక్కజొన్న సాగు, దిగుబడి పెరిగిందని కేంద్రానికి వివరించిన మంత్రి అచ్చెన్న
- ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కజొన్న కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి
- ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తో మాట్లాడి, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి చౌహన్ హమీ
అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తోందని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో శనివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శనగలు, మొక్కజొన్న పంటల పరిస్థితిని సమగ్రంగా వివరించి, రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో శనగల సాగు గణనీయంగా పెరిగి, మొత్తం సుమారు 7,13,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైందని తెలిపారు. ఇప్పటివరకు 94,500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటను రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి వివరించారు. అదనంగా 1,78,250 మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు తక్షణమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తూ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

అలాగే మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి కేంద్రానికి వివరించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. మిర్చి, పొగాకు రైతులు క్రాప్ డైవర్షన్ చేసి మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని పెంచారని, దీంతో దిగుబడులు అధికంగా వచ్చినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది ఇరాన్ యుద్ధ ప్రభావం, ఈతనాల ఉత్పత్తిలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగడం వల్ల మొక్కజొన్నకు డిమాండ్ తగ్గిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మొక్కజొన్న పంట కొనుగోలు పీడీఎస్ స్కీంలో లేకపోయినప్పటికీ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి తో వెంటనే మాట్లాడి, మొక్కజొన్న కొనుగోలు అంశంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, కేంద్రంతో సమన్వయం చేసుకుని రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెట్ సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.