భారత్ న్యూస్ హైదరాబాద్….ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య.. నార్సింగిలో షాక్ ఘటన
హైదరాబాద్: నగరంలోని నార్సింగి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాక్లెట్ ఇస్తానంటూ నమ్మబలికి చిన్నారిని తీసుకెళ్లిన ఓ కామాంధుడు అనంతరం ఆమెపై అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు.
సమాచారం ప్రకారం, చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రి సుమారు 10 గంటల సమయంలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారిని ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో అతడిని గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన విచారణలో నిందితుడు చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు వెల్లడైనట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారిపై జరిగిన దారుణంపై ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
