ఉమ్మడి పౌరస్మృతికి సమయం ఆసన్నమైంది!

భారత్ న్యూస్ గుంటూరు…ఉమ్మడి పౌరస్మృతికి సమయం ఆసన్నమైంది!

ఈ అంశాన్ని చట్టసభలే తేల్చాలి
షరియత్‌ చట్టం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ముస్లింలకు సంబంధించిన 1937 నాటి షరియా చట్టంలోని నిబంధనలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ సమస్యకు ఉమ్మడి పౌర స్మృతి పరిష్కారం అని పేర్కొన్నది.

షరియాలోని వారసత్వ నిబంధనను కొట్టివేస్తే చట్టపరమైన శూన్యత ఏర్పడుతుందని, ఎందుకంటే ముస్లింల వారసత్వాన్ని నియంత్రించే మరో చట్టబద్ధమైన మార్గం ఏదీ లేదని తెలిపింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘సంస్కరణలు తేవాలన్న మన అత్యుత్సాహం వల్ల, షరియాలోని వారసత్వ నిబంధన ద్వారా ప్రస్తుతం వారు పొందుతున్న దానికంటే తక్కువ మొత్తాన్ని ఇచ్చిన వారమవుతామేమో. ఒకవేళ 1937 నాటి షరియా చట్టాన్ని రద్దు చేస్తే.. ఆ తరువాత పరిస్థితి ఏంటి? అనవసరమైన శూన్యత ఏర్పడదా?’ అని ప్రశ్నించారు.

‘ఈ కేసులో ముస్లిం మహిళలు వివక్షకు గురవుతున్నారన్న మీ వాదన సబబే. కానీ ఈ అంశాన్ని చట్టసభల వివేకానికి వదిలేయడం మంచిది కదా!’ అని వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు పరిష్కారం ‘ఉమ్మడి పౌర స్మృతే’ అని సీజేఐ స్పష్టం చేశారు. జస్టిస్‌ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. ఒక వ్యక్తికి ఒక భార్య అన్న నిబంధన అన్ని మతాలకు ఒకేరీతిగా వర్తించడం లేదని అన్నారు.