బీర్పూర్ సరిహద్దుల్లో ‘హైనా’ జంతువు అలజడి:

భారత్ న్యూస్ విజయవాడ…బీర్పూర్ సరిహద్దుల్లో ‘హైనా’ జంతువు అలజడి:

ప్రాణాలు దక్కాలంటే అప్రమత్తమే మార్గం!

​పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు.. ప్రజాప్రతినిధుల అత్యవసర హెచ్చరిక!

బీర్పూర్ పరిధిలోని అరగుండాల ప్రాజెక్టు సమీప అటవీ ప్రాంతంలో ప్రమాదకరమైన హైనా (దుప్పిలి) సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రూర మృగం కదలికలను గుర్తించిన కొల్వాయి సర్పంచ్ రంగు లక్ష్మణ్‌తో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేశారు., ముఖ్యంగా కొల్వాయి, మంగేలా, తాళ్ల ధర్మారం, రేకులపల్లి, చర్లపల్లి, తుంగూరు, నరసింహుల పల్లె, కమ్మనూరు, కండ్లపల్లి మరియు రంగాసాగర్ గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు మరియు పశువుల కాపరులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా సాగు పనుల కోసం పొలాల వద్దకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకూడదని, పొలాల వద్ద రాత్రి సమయాల్లో కాపలా ఉండే వారు టార్చ్ లైట్లు, కర్రలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపరులు తమ గొర్రెలు, బర్రెలను మేత కోసం అడవి లోపలికి ఒంటరిగా తీసుకెళ్లవద్దని, ఎల్లప్పుడూ గుంపులుగా ఉండాలని కోరారు. సాయంత్రం వేళల్లో చీకటి పడకముందే నివాసాలకు చేరుకోవాలని సర్పంచ్ రంగు లక్ష్మణ్, సర్పంచులు మురళి మరియు ఇతర గ్రామ పంచాయతీ పాలకవర్గాలు విజ్ఞప్తి చేశాయి. బీర్పూర్ మండల అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని, క్రూర మృగం జనావాసాల్లోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని కోరారు.