సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న పేర్లు ……

భారత్ న్యూస్ తిరుపతి…సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న పేర్లు …………..!!
షణ్ముఖుడు – ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు – పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు – కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు – శరములో అవతరించినవాడు
గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి – దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు – శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ – తమిళం లో పిలుస్తారు.

  • క‌ష్టాల‌ను త‌ప్పించే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి

సుబ్రహ్మణ్యేశ్వరుడు స‌ర్ప‌రూపుడు. కుజున‌కు అధిష్టాన దైవం. ప్ర‌పంచంలోని నాగులంద‌రికీ అధిప‌తి. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. ఎలాంటి క‌ష్టాల‌నైనా త‌ప్పించ‌గ‌ల స‌మ‌ర్ధుడు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి.

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

ఇక జాతకంలో చాలా మందికి కాలసర్పదోషం ఉంటుంది. అలాగే రాహు, కేతు దోషాలు ఉంటాయి. అలాంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం స‌ర్వ‌దా శ్రేయస్కరం. సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.

అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం. పిల్ల‌ల‌ను కోరుకునే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను తాగితే వారికి సంతానం క‌లుగుతుంట‌నే న‌మ్మ‌కం ఉంది. పెళ్లి, ఉద్యోగం, ఆస్తి త‌గాదాలు, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించ‌డం వంటివి ఏవైనా అన్ని స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌గ‌ల దేవుడు సుబ్రహ్మ‌ణ్యేశ్వ‌రుడు.🙏