పెద్దల పన్నులను పేదలకు పంచుతున్న జగనన్నకు అండగా నిలబడుదాం : టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన పిలుపు

తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతి నగరం
పెద్దలకు వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదల అభివృద్దికి నవరత్న పథకాల ద్వారా పంచుతున్న మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలబడుదామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో సోమవారం సాయంత్రం జగనన్న ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు, హౌసింగ్, మునిసిపల్ అధికారుల సమక్షంలో రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాల అమలు అవుతాయన్నారు. పేదల పట్ల జగనన్న ప్రభుత్వం అకుంఠిత దీక్షతో ఉందని, తిరుపతిలో జగనన్న ఇప్పటికే 26వేల ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మరో రెండు వేల ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు మొత్తం అందరికీ ఇళ్ల‌ను నిర్మించి, తాళాలు కూడా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ మాటకొస్తే రాష్ట్రంలో కొత్తగా ఊర్లకు ఊర్లోనే నిర్మిస్తున్నారని, ఇందుకోసం జగనన్న 56 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు జగనన్న రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ చేశారని, సంక్షేమ పథకాల కింద మరో లక్ష కోట్లతో కలిపి మూడు లక్షల 35 వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చిన వ్యక్తి జగనన్న అని భూమన పేర్కొన్నారు. మా పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం విద్యాభివృద్ధికి జగనన్న 52 వేల కోట్ల రూపాయల ఖర్చు చేశాడని మీరే చెప్పండని, జగనన్న చలువతోనే తిరుపతిలో కొత్తగా ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లను వేయడం జరిగిందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగిందని, అలాగే విశ్రాంత ఉద్యోగులకు మంగళవారం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేస్తే పేదలుగా మీరు ఓడిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, హౌసింగ్ పీడి వెంకటేశ్వర రావు, డిప్యూటీ తాసీల్ధార్ అశోక్ రెడ్డి, హౌసింగ్ కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.