sricity B-Rolex Industry is a key partner in the Uttarkashi Rescue Operation

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్ లో శ్రీసిటీ బి-రోలెక్స్ పరిశ్రమ కీలక భాగస్వామ్యం

భారత్ న్యూస్
శ్రీసిటీ, నవంబర్ 29, 2023:

ప్రశంశనీయ సమిష్టి కృషి ఫలితంగా, ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం రాత్రి సురక్షితంగా బయటపడిన సంఘటన దేశమంతటా సంతోషం నింపింది. క్లిష్టమైన సవాళ్లతో 17 రోజుల పాటు అవిశ్రాంతంగా సాగిన పలు సంస్థల సంయుక్త సహాయక చర్యల్లో శ్రీసిటీలోని బి-రోలెక్స్ పరిశ్రమ కీలకమైన సాంకేతిక సహకారం అందించింది.

రెస్క్యూ పనులు సాగుతున్న కీలక దశలో నవంబర్ 25న డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముందుకు కదలక సిబ్బంది పలు ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో, తగు పరిష్కారం కోసం పర్యవేక్షక అధికారులు DRDO మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని కోరగా, ఆయన వివిధ నిపుణుల ఏజెన్సీలను సంప్రదించారు. ఆయన పిలుపుకు వెంటనే స్పందించిన బి-రోలెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, డ్రిల్లింగ్ కు పరిష్కార మార్గంగా ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా ప్రతిపాదించారు.

అలాగే మూడు గంటల వ్యవధిలోనే రెండు పోర్టబుల్ ప్లాస్మా కట్టింగ్ మెషీన్‌లను బి-రోలెక్స్ సిద్ధం చేసింది. వీటితో పాటు, ప్లాస్మా కట్టర్లను వినియోగించే పరిశ్రమకు చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందాన్ని (సంతోష్ కుమార్, అజయ్ షా, నాగరాజు) ఘటన స్థలానికి పంపారు. ప్లాస్మా కట్టర్‌లతో పాటు నిపుణుల బృందాన్ని పంపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేసింది. విజయవంతంగా కట్టర్ నిపుణులు పైప్‌లైన్‌ను సిద్ధం చేసి, కొన్ని గంటల వ్యవధిలో సహాయక చర్యలకు అడ్డుపడిన యంత్రపు ముక్కలను తొలగించారు.

వేగంగా స్పందించడంతో పాటు సహాయక చర్యలకు నిపుణుల బృందాన్ని పంపిన బి-రోలెక్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబంలో బి-రోలెక్స్ భాగం కావడం గర్వంగా ఉందన్న ఆయన, రెస్క్యూ ఆపరేషన్ కీలక సమయంలో తగు సహాయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

బి-రోలెక్స్ సమకూర్చిన ప్లాస్మా కట్టింగ్ మెషీన్‌ లు, సహాయక చర్యల్లో ముఖ్యమైన అడ్డంకిని అధిగమించడంలో మరియు 800 మిమీ వ్యాసం కలిగిన పైపును ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సహాయక చర్యలు పర్యవేక్షించిన భాస్కర్ కుల్బే మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు, తన వినూత్న ఆలోచనలతో వేగంగా స్పందించి సాయమందించిన శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

గత ఆరు సంవత్సరాలుగా శ్రీసిటీలో వున్న స్వదేశీ పరిశ్రమ బి-రోలెక్స్, ఇంజనీరింగ్ విభాగంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్ లో కంపెనీ అందించిన విశేష సహకారం, సంక్షోభ సమయాల్లో సూచించిన పరిష్కార మార్గాలు దాని ప్రాధాన్యతను స్పష్టం చేశాయి.