Andhra Pradesh: వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఆలస్యానికి చెక్.. ఇక 24 గంటల్లోనే..

భారత్ న్యూస్ రాజమండ్రి..Andhra Pradesh: వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఆలస్యానికి చెక్.. ఇక 24 గంటల్లోనే..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫైళ్లు రోజుల తరబడి పెండింగ్‌లో ఉండటంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా నిర్ణీత గడువు లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు అధికారుల అనుమతి కోసం ఆగిపోతున్నాయని గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ దరఖాస్తులు అధికారుల ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు రవాణాశాఖ గుర్తించింది. డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసినా.. అధికారుల నుంచి ఆమోదం ఆలస్యమవడంతో వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

24 గంటల్లో పూర్తి చేయాల్సిందే
ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఇకపై ఫ్యాన్సీ నంబర్లను మినహాయించి సాధారణ రిజిస్ట్రేషన్‌లన్నీ 24 గంటల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు వచ్చిన తర్వాత 24 గంటల్లో అధికారులు స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే అది ఆటోమేటిక్‌గా ఆమోదమైనట్టుగా పరిగణించే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు సెలవు రోజుల్లో కూడా అధికారులు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇవ్వాలని రవాణాశాఖ సూచించింది. పెండింగ్‌లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

డీలర్లు, వాహనదారులకు ఊరట
కొత్త విధానం వల్ల డీలర్లు వాహనాలను త్వరగా డెలివరీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా సేవలను వేగవంతం చేయడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.