భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..!
ఇరాన్ వార్ నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభం (LPG Crisis) నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్బీజీ సంక్షోభాన్ని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకే ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇందులో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని తేల్చేశారు.ఎల్బీజీ స్ధానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణ కోసం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 60 వేల మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని అధికారులు సీఎంకు తెలిపారు. అయితే దీనిని 100 శాతం వినియోగించుకునేలా చూడటంతో పాటు, జిల్లాకు కనీసం 10 వేలకు తగ్గకుండా నూతన కనెక్షన్లు ఇవ్వాలంటూ సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు.అలాగే శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి ల రాయాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని, ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించేలా చూడాలన్నారు.విద్యా సంస్థలకు, ఆస్పత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటిన్లు, హోటళ్లకు ప్రాధాన్యతా క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. మరోవైపు గత ఐదు రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పారు.
