24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

భారత్ న్యూస్ రాజమండ్రి…24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది.

వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది.

పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులకు సైతం సూచనలు చెప్పి, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని పేర్కొంది.