పాలకుల పొదుపు బాట.. ప్రజలకు స్ఫూర్తిదాయకం

భారత్ న్యూస్ గుంటూరు…పాలకుల పొదుపు బాట.. ప్రజలకు స్ఫూర్తిదాయకం

మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించి చమురు ఆదా చేయడం అభినందనీయం

మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్‌ల నిర్ణయాలను ప్రజలూ పాటించాలి

అవనిగడ్డ :ప్రజాప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సంక్షోభ సమయాల్లో పొదుపు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, అదే బాటలో ప్రజలు కూడా నడవాలని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంలో చమురు పొదుపు అవసరమైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నెల్లూరులో లక్షలాది మందితో భారీగా జరగాల్సిన తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడును రద్దు చేసి, కేవలం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించడం ఆయనకు దేశంపై ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. మే 27, 28 తేదీల్లో మంగళగిరి ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ల వారీగా స్క్రీన్ల ద్వారా కార్యకర్తలకు చేరవేయడం ద్వారా భారీగా ఇంధనం ఆదా అవుతుందని ఆయన వివరించారు.కేవలం మహానాడు రద్దు మాత్రమే కాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ నిరాడంబరత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు తమ కాన్వాయ్‌లను కుదించుకోవడం వంటి చర్యలు సమాజంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టాయని చైర్మన్ అన్నారు.రాష్ట్ర, దేశ నాయకులు తమ విలాసాలను, ప్రతిష్టాత్మక ఈవెంట్లను వదులుకుని పొదుపును పాటిస్తున్నప్పుడు.. ప్రజలు కూడా ముఖ్యంగా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అని అన్నారు
ప్రతిపక్షాల విమర్శలకు తావులేకుండా, దేశ ప్రయోజనాల కోసం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ స్ఫూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి రామమోహనరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,పార్టీ నాయకులు దాసినేని శ్రీనివాసరావు,కంచర్ల ఆనంద్,నాగిడి రాంబాబు,చెన్ను బాబూరావు తదితరులు పాల్గొన్నారు