ఐపీవో బాటలో లలితా జువెలరీ.. రూ.1700 కోట్ల సమీకరణకు ప్రణాళిక

భారత్ న్యూస్ అనంతపురం .. …ఐపీవో బాటలో లలితా జువెలరీ.. రూ.1700 కోట్ల సమీకరణకు ప్రణాళిక

పబ్లిక్ ఇష్యూకు లలితా జువెలరీ మార్ట్ సన్నాహాలు

ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ షేర్ల విక్రయం

కొత్తగా 12 స్టోర్ల ఏర్పాటుకు నిధుల వినియోగం

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో షేర్ల లిస్టింగ్

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా సుమారు రూ.1700 కోట్లు సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

సమీకరించదలచిన మొత్తంలో రూ.1200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయాలని లలితా జువెలరీ ప్రతిపాదించింది. దీనికి అదనంగా ఆఫర్ ఫర్ సేల్ (వోఎఫ్‌ఎస్) విధానంలో సంస్థ ప్రమోటర్ అయిన కిరణ్ కుమార్ జైన్ తన వాటా నుంచి రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.

చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లలితా జువెలరీకి దక్షిణ భారతదేశంలోని పలు నగరాల్లో మొత్తం 56 రిటైల్ విక్రయశాలలు ఉన్నాయి. 2022-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సంస్థ ఆదాయాల్లో ఏటా సగటున 43.62 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, సంస్థకు కొంత రుణ భారం కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ ఐపీవో ద్వారా లభించే నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణకు ఉపయోగించనున్నారు. కొత్తగా 12 స్టోర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర కార్పొరేట్ అవసరాలకు కూడా ఈ నిధులను కేటాయించనున్నారు. ఐపీవో ప్రక్రియ పూర్తయిన తర్వాత సంస్థ ఈక్విటీ షేర్లను ఎన్‌ఎస్‌ఈ (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్), బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్)లలో నమోదు చేయిస్తారు.

ఈ పబ్లిక్ ఇష్యూకు ఆనంద్‌ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్‌ కేపిటల్‌ సంస్థలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఐపీఓకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లో టైటన్‌ ఇండియా, కళ్యాణ్‌ జువెలర్స్, పీసీ జువెలర్స్, పీఎన్‌ గాడ్గిల్‌ జువెలర్స్, తంగమలై, త్రిభోవన్‌దాస్ భీమ్‌జీ జవేరి (టీబీజడ్) వంటి పలు ఆభరణాల విక్రయ సంస్థలు లిస్టయి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లలితా జువెలరీ కూడా ఈ జాబితాలో చేరనుంది.