హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు.

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు. దీనికి తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమంగా ప్రభుత్వం పేరు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతోపాటు ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోనూ దీన్ని అమలు చేయనున్నారు. ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకూ విస్తరించనున్నారు. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి అమల్లోకి వస్తాయి. అందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు ఉదయం అల్పాహారంతోపాటు వారంలో మూడు రోజులపాటు పాలు కూడా అందిస్తారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ద్వారా ఉదయం అల్పాహారం అందించనున్నారు. ఆసక్తి చూపే స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీవో)లకు బాధ్యతలను అప్పగించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39 చోట్ల నిర్మించే కేంద్రీకృత కిచెన్ల నిర్మాణానికి రూ.299.90 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటికే ఉన్న 7 కిచెన్లను ఉన్నతీకరిస్తారు. మిగిలిన 32 కిచెన్లను కొత్తగా నిర్మిస్తారు. ఒక్కో కిచెన్‌కు అయ్యే వ్యయంలో ప్రభుత్వం తన వాటాగా 70 శాతం భరిస్తుంది.  పథకానికి తొలి విడతగా రూ.180 కోట్లను మంజూరు చేశారు. 

26,561 విద్యాసంస్థలు…20.29 లక్షల మంది విద్యార్థులు
రాష్ట్రం ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు 26,561 ఉన్నాయి. వాటిల్లో చదువుతున్న మొత్తం 20.29 లక్షల మంది విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో మూడు రోజులపాటు రాగి జావ ఇస్తున్నారు. మరో మూడు రోజులు పాలు అందిస్తారు. ఒక్కో విద్యార్థికి 100-150 మిల్లీ లీటర్లు సరఫరా చేస్తారు. ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 100 మిలీ, ఇంటర్‌ దాకా మిగిలిన తరగతుల వారికి 150 మిలీ చొప్పున అందజేస్తారు.