రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

భారత్ న్యూస్ గుంటూరు…ప్లాస్లిక్ భూతాన్ని తరిమి…
భవితరాలకు ఆరోగ్యానిద్దాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి : మన ఇంటి నుంచి, మన గ్రామ నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లను, వస్తువుల వాడాకానికి దూరంగా ఉండాలని అన్నారు. చెత్త మీద పన్ను రద్దు చేసి, అదే చెత్తతో సంపద సృష్టిస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడిదన్నారు. పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛంధ్ర – స్వర్ణాంధ్ర కోసం సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి, గ్రామాల్లో పరిశుభ్రతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో అటు ఆరోగ్యం, ఇటు పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. ఇళ్ల్లోకి, గ్రామాల్లోకి ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు రాకుండా చేయడంలో మహిళలే కీలకమన్నారు. మన భావితరాలకు ఆస్తులతో ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గత పాలకులు చెత్త మీద పన్ను వేసి, ప్రజలపై ఆర్థిక భారంగా మోపారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి, అదే చెత్త ద్వారా సంపద సృష్టిస్తున్నారన్నారు. చెత్తతో వర్మీ కంపోస్ట్, ఇతర సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారన్నారు. స్వచ్ఛ రథాల ద్వారా ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థాలు సేకరించి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారన్నారని మంత్రి సవిత తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి షాపు వద్ద మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను తెలిపే ప్లేక్సీలు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు.

ప్రకృతి వ్యవసాయంతో మేలు

క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక రోగాలతో మనుషుల ప్రాణాల పోవడంలో ప్లాస్టిక్ తో పాటు అతిగా ఎరువుల వాడకం కూడా కారణమని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తోందన్నారు. సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ మంచి డిమాండ్ ఉందని, తద్వారా అధిక లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. జంక్ ఫుడ్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తోందని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని మంత్రి సవిత సూచించారు. చెత్తను ఎక్కడి పడితే అక్కడ పడేయకుండా, ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలన్నారు. స్వచ్ఛ పెనుకొండ బాధ్యత పట్టణ ప్రజలందరిదీనని స్పష్టంచేశారు. అనంతరం గాంధీ సర్కిల్ లో మానవ హారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటామని మానవ హారంలో పాల్గొన్నవారితో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు.

నడిచి… రోడ్డుపై చెత్త ఏరివేసి…

నా దేశం – నా బాధ్యత కింద ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు మాటలను మంత్రి తూచ తప్పకుండా పాటించారు. పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ లో నిర్వహించిన స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి సవిత తన క్యాంపు కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్లి పాల్గొన్నారు. ఎటువంటి వాహన శ్రేణిని వినియోగించకుండా, మంత్రి సవిత ఈ కార్యక్రమంలో పాల్గోనడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు పట్టణంలోని షాపులు, తోపుడు బండ్ల వద్దకు గుడ్డతో తయారు చేసిన క్యారీ బ్యాగ్ లను అందజేశారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు కాటన్ వస్త్రాలతో తయారు చేసిన క్యారీ బ్యాగులివ్వాలని సూచించారు. అనంతరం షాపుల ఎదుట పడివున్న చెత్తను మంత్రి సవిత స్వయంగా తీసి, డస్ట్ బిన్ లో వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.