సిబ్బందితో మమేకం కావడం కోసమే వనభోజనాలు: టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

….Bharathnews.hyd,,

సిబ్బందితో మమేకం కావడం కోసమే వనభోజనాలు: టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్

తమ సిబ్బందితో మమేకం కావడం కోసమే డిపోల్లో వన భోజనాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు. నిత్యం విధి నిర్వహణలో బిజిగా ఉండే డిపోలో పనిచేసే ఉద్యోగులందరినీ ఒక చోటుకి చేర్చి.. ఉల్లాసంగా గడిపేందుకే వన భోజనాలకు సంస్థ శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ రీజియన్ పరిధిలోని రాజేంద్ర నగర్ డిపో ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిబ్బందిని అప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిమందికి ఆయనే స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఆనందం, ఆహ్లాదకరంగా సాగే ఈ వన భోజనాలు మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతాయన్నారు. ముఖ్యంగా వన భోజనాలతో ఐక్యత, స్నేహాభావం పెంపొందుతుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేయడం వెనక టీఎస్ఆర్టీసీ సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ పథకం ద్వారా దాదాపు 7 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చామని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రశాంతంగా అమలుచేస్తున్నారంటూ తమను రాష్ట్ర ప్రభుత్వం మొచ్చుకుంటుందని చెప్పారు.

సంస్థకు ప్రయాణికులు, సిబ్బంది రెండు కండ్ల లాంటి వారని గుర్తు చేశారు. సిబ్బంది పెండింగ్ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. “టీఎస్ఆర్టీసీని మీ కుటుంబంలో ఒకరిలాగా భావించి.. కష్టపడుతున్నారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన విజయవంతం చేస్తున్నారు. గత రెండేన్నరేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశంలోనే రోల్ మోడల్ గా టీఎస్ఆర్టీసీ నిలిచింది. దీని వెనక సిబ్బంది కృషి, పట్టుదల ఎంతో ఉంది. నిబద్దత, క్రమ శిక్షణతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైంది.” అని సిబ్బందిని ప్రశంసించారు.

ఈ వనభోజనాల కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్(అడ్మిన్) కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంలు విజయభాను, జగన్, రాజేంద్ర నగర్ డిపో మేనేజర్ శ్రీనాథ్ , తదితరులు పాల్గొన్నారు.

పీఆర్వో, టీఎస్ఆర్టీసీ