పెట్రోల్ బంకుల్లో కొత్త మార్పులు.. ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం నిర్ణయం

భారత్ న్యూస్ హైదరాబాద్…పెట్రోల్ బంకుల్లో కొత్త మార్పులు.. ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం నిర్ణయం

ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశంలో ఇంధన నిల్వలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పంపుల్లో కొత్త పెట్రోలియం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ప్రవేశపెట్టనుంది. వాహనం రకాన్ని బట్టి వివిధ రకాల ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ బ్రాండ్లను తీసుకానుంది. E20, E22, E25, E30 వంటి అనేక ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ బ్రాండ్‌లను తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలతో పాటు ప్రైవేట్ కంపెనీలైన జియో-బిపి, నయారా ఎనర్జీ, షెల్‌ కంపెనీలు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది.

పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక లేబుల్
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక లేబుల్ ఇస్తారు. అలాగే ఇంధనానికి కలిపిన ఇథనాల్ పరిమాణాన్ని డిస్పెన్సర్ స్పష్టంగా సూచిస్తుంది. దీంతో వినియోగదారులు తమ వాహనానికి అవసరమైన సరైన రకాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ పంపులలో E20 పెట్రోల్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఇప్పుడు ఎక్కువగా ఉంది. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉండగా.. అధిక భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల క్రమంలో ఇథనాల్‌ను ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇథనాల్ కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించింది. ఇక మైలేజ్, ఇంజిన్ విషయానికికొస్తే.. అధిక ఇథనాల్ శాతం ఉన్న పెట్రోల్ వాడితే మైలేజ్, ఇంజిన్ పనితీరు నెమ్మదిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. అయినప్పటికీ E20 వంటి ఇంధనాలు వాహనం పికప్‌ను మెరుగుపరుస్తాయని, మైలేజ్‌పై పెద్దగా ప్రభావం చూపవని ప్రభుత్వం చెబుతోంది. బ్రెజిల్‌లో మాదిరిగా భవిష్యత్తులో భారతదేశంలోని వినియోగదారులు తమ అవసరాలకు తగినట్లుగా వివిధ ఇథనాల్ మిశ్రమాలతో కూడిన పెట్రోల్‌ను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తగ్గనున్న దిగుమతులు
పెట్రోల్‌పై ఆధారపటాన్ని తగ్గించడం వల్ల దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. దీని వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా లాభం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితుల క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కూాడా ఉండవు. ముడి చమురు ధరలు పెరిగినా భారత్‌పై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది…. 𝗚𝗡𝗥