యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీసీపీ భాస్కర్

భారత్ న్యూస్ వరంగల్..యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీసీపీ భాస్కర్

మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్‌లో జరిగిన అవగాహన సదస్సులో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలపై విద్యార్థులు గీసిన చిత్రాలను డీసీపీ పరిశీలించి, డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులు చూపిన అవగాహనను అభినందించారు. తెలిసో తెలియకో డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.