ఒంటరిగా నివసిస్తున్న మహిళ హత్య కేసును ఛేదించిన గన్నవరం పోలీసులు

భారత్ న్యూస్ విజయవాడ…ఒంటరిగా నివసిస్తున్న మహిళ హత్య కేసును ఛేదించిన గన్నవరం పోలీసులు

రూ.56 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం – ఇద్దరు నిందితుల అరెస్ట్

విలేకరులు సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

క్రైమ్ న్యూస్ కృష్ణా :

కృష్ణాజిల్లా గన్నవరం సబ్‌డివిజన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును గన్నవరం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు వెల్లడించారు.

కేసు వివరాలు

గన్నవరం దావాజీగూడెం రోడ్డులోని GKR పారడైజ్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ నెం.401లో నివసిస్తున్న కాజ రజిత కుమారి (55) తన భర్త మరణానంతరం ఒంటరిగా నివసిస్తూ శ్రీనగర్ కాలనీలో జ్యోతి పిండి మర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు.

▪️ది.24-05-2026 రాత్రి సమయంలో మృతురాలు తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని చెప్పి ఫోన్ పెట్టారు. అనంతరం ఫోన్‌కు స్పందించకపోవడంతో అనుమానం కలిగింది. మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా రజిత కుమారి బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించి వెంటనే 112కు సమాచారం ఇచ్చారు.

▪️మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ కెమెరాలతో కీలక ఆధారాలు

దర్యాప్తులో భాగంగా అపార్ట్మెంట్ సీసీ కెమెరాలను పరిశీలించగా, మృతురాలికి పరిచయస్తురాలైన పోలవరపు సుష్మ మరియు ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ 24-05-2026 రాత్రి 10:07 గంటలకు ఫ్లాట్‌లోకి ప్రవేశించి, రాత్రి 11:17 గంటలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు.

దీనితో కేసును మర్డర్ ఫర్ గెయిన్‌గా మార్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిందితుల అరెస్ట్

జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు గన్నవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీ పాల శ్రీనివాస్ పర్యవేక్షణలో, గన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సీఐ శ్రీ ఎల్. రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.

దర్యాప్తులో లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు

▪️సుమారు 390 గ్రాముల బంగారం

▪️రూ.1,60,000 నగదు

▪️నేరానికి ఉపయోగించిన AP40KF8842 Suzuki Access వాహనం

▪️మొత్తం సుమారు రూ.56 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేరానికి కారణం

▪️ప్రధాన నిందితురాలు పోలవరపు సుష్మకు ఓ వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధానికి మృతురాలు అడ్డుగా ఉందనే భావనతో పాటు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా మృతురాలి వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకోవాలనే దురాశతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితుల వివరాలు:

1 . పోలవరపు సుష్మ (43)
నివాసం: తాడిగడప, పెనమలూరు మండలం
ప్రస్తుతం: శ్రీనగర్ కాలనీ, గన్నవరం

2 . పోలవరపు అజయ్ కుమార్ (25)
ప్రస్తుతం: శ్రీనగర్ కాలనీ, గన్నవరం

▪️అజయ్ కుమార్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన అధికారులు

▪️శ్రీ పాల శ్రీనివాస్ – డీఎస్పీ, గుడివాడ / ఇన్‌చార్జ్ డీఎస్పీ, గన్నవరం

▪️శ్రీ ఎల్. రమేష్ – సీఐ, గన్నవరం

▪️శ్రీ కె. శ్రీధర్ – ఎస్సై

▪️శ్రీ ఎం. నాగరాజు – ఎస్సై

▪️శ్రీమతి ఎన్. ప్రశాంతి – ఎస్సై
▪️హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలు

▪️ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.